AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మేయర్ సీట్లు ఎవరికి..? టీడీపీ, జనసేన, బీజేపీ.. ఎవరి లెక్కలు వారివే

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు వేగం పెరుగుతున్న వేళ మేయర్ సీట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి తదితర కీలక నగరాలపై ఎవరి ఫోకస్ ఉందన్న చర్చ సాగుతోంది. అయితే సీట్ల తుది పంపకం, అభ్యర్థుల ఖరారు ఇంకా జరగలేదు.

ఆ మేయర్ సీట్లు ఎవరికి..? టీడీపీ, జనసేన, బీజేపీ.. ఎవరి లెక్కలు వారివే
Ap Local Body Elections
Shaik Madar Saheb
|

Updated on: Oct 08, 2026 | 8:44 AM

Share

లోకల్‌ వార్‌ కోసం ఎవరి వ్యూహాలు వారివే అన్నట్టుగా మారాయి. ముఖ్యంగా కూటమి పార్టీలు కీలక నగరాల్లోని మేయర్ స్థానాలపై అప్పుడే కర్ఛీఫ్‌లు వేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే సీట్ల సర్దుబాటులో భాగంగా ముందుగా మేయర్ సీట్ల అంశంపైనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏ పార్టీ ఎక్కడ పాగా వేయాలనుకుంటోంది ? ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి ?

మెజార్టీ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు

స్థానిక ఎన్నికలను ఏపీలోని అధికార కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు పార్టీలు కలిసి మరోసారి భారీ విజయం సాధించాలని ప్లాన్ చేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారై, నోటిఫికేషన్ విడుదలైన వెంటనే క్షేత్రస్థాయిలోకి ఎంట్రీ ఇచ్చి మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

మేయర్ సీట్ల పంపకంపై కూటమి ఫోకస్

స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకంపై దృష్టి పెట్టిన కూటమి పార్టీలు.. ముందు కీలకమైన మేయర్ స్థానాల పంపకంపైనే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో 10 కీలక మేయర్ స్థానాల్లో ఏ పార్టీ పోటీలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. విశాఖ, రాజమండ్రి మేయర్ స్థానాలపై బీజేపీ ఫోకస్ చేసిందని.. ఈ రెండు స్థానాలు కోరుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

కాకినాడ, మచిలీపట్నంపై జనసేన ఫోకస్?

ఇక కాకినాడ, మచిలీపట్నం మేయర్ స్థానాలను జనసేన ఆశిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏలూరు, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, గుంటూరు సహా ఇతర కార్పొరేషన్లలో టీడీపీ బరిలో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక తిరుపతి మేయర్ స్థానం కోసం ఏ పార్టీ రేసులో నిలుస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

మేయర్ స్థానాలపై వైసీపీ ఫోకస్

మరోవైపు వైసీపీ కూడా మేయర్ స్థానాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఒకవేళ రిజర్వేషన్ మారితే అభ్యర్థిని మార్చాలని నిర్ణయించింది.

నెల్లూరు మేయర్ సీటుపై రసవత్తర పోరు

నెల్లూరులో టీడీపీ నుంచి రూప్ కుమార్ యాదవ్‌తో పాటు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి కూడా మేయర్ సీటు కోసం పోటీ పడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. దీంతో నోటిఫికేషన్ రాకముందే నెల్లూరు మేయర్ సీటు కోసం పోటీ రసవత్తరంగా మారినట్టు కనిపిస్తోంది.

రిజర్వేషన్లు ఖరారైతే మేయర్ సీట్లపై క్లారిటీ

ఏపీలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ముందుగా మేయర్ సీట్లపైనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కూటమి పార్టీ ఇప్పటికే దీనిపై ఓ అవగాహనకు వచ్చినా.. రిజర్వేషన్ల కోసమే ఎదురుచూస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.

Follow Us