SIR Special Drive: ఓటర్ లిస్ట్‌లో పేరు మిస్సైన వారికి మరో ఛాన్స్.. ఈ ఫామ్ ఫిల్ చేస్తే చాలు..
ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభం కాబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన 46.62 లక్షల ఓటర్ల వివరాలను మరోసారి వెరిఫై చేయనున్నారు అధికారులు. ప్రతి ఓటర్ ఇంటికి మళ్లీ బీఎల్‌ఓలు వెళ్లబోతున్నారు. బీఎల్‌ఓల పరిశీలన అనంతరం సవరణలో అర్హులైన వారి పేర్లను చేరుస్తామని సీఈవో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ సర్వే మళ్లీ మొదలు కానుంది. ఇటీవలే జరిగిన ఎస్‌ఐఆర్ తర్వాత తొలగించిన ఓటర్ల జాబితాను మరోసారి వెరిఫికేషన్ చేయనున్నారు అధికారులు. ఈ మేరకు ఓటర్ల జాబితా పునర్ పరిశీలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. తొలగించిన 46.62 లక్షల పేర్లను ఇంటింటికెళ్లి పరిశీలిస్తామని తెలిపారు. నేటి నుంచి నుంచి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లనున్నారని తెలిపారు. తొలగించిన ఓటర్ల పరిస్థితిపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వెల్లడించారు.
46.62 లక్షల ఓట్ల తొలగింపు.. మళ్లీ రీ వెరిఫికేషన్
చనిపోయిన వారివి, శాశ్వతంగా వలస వెళ్లిన వారివి, డూప్లికేట్ నమోదులతో ఉన్న ఓటర్లను తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ గణనలో 44 లక్షల 89 వేల 512 మంది ఓటర్లు అందుబాటులో లేరన్నారు. జులై 31వ తేదీన 3 కోట్ల 71 లక్షల 38 వేల 182 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల చేశామని ప్రస్తావించారు. నోటీసు దశలో మరో లక్షా 73 వేల 071 మంది అనర్హులుగా గుర్తించామని సీఈవో వివేక్ యాదవ్ తెలిపారు. 46 లక్షల 62 వేల 583 మంది తొలగించిన ఓటర్ల జాబితాతో ఇంటింటికీ బీఎల్‌ఓలు వెళ్తారని చెప్పారు. పొరపాటున పేరును తొలగిస్తే ఫారం-6తో మళ్లీ నమోదు చేసుకోవచ్చని సూచించారు.
మిస్సైతే మళ్లీ నమోదు చేసుకోండి
బీఎల్‌ఓల పరిశీలన అనంతరం నిరంతర సవరణలో అర్హులైన వారి పేర్లను చేరుస్తామని వెల్లడించారు. కొత్తగా అర్హత పొందిన వారు కూడా ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తీసివేయకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హత లేని నమోదులను ఓటర్ల జాబితాలో లేకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఈనెల16న ఏపీలో ఎస్‌ఐఆర్-2026 తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. తుది జాబితా తర్వాత కూడా నిరంతర సవరణ ద్వారా ఓటర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1 తేదీలను క్వాలిఫైయింగ్ డేట్లుగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
