కుబేరులు అడ్డుకుంటున్నారు.. భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి కొంతమంది కుబేరులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించారు. అయితే ఆయన ఎవరి పేర్లను వెల్లడించలేదు. మస్క్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ అడ్డుకుంటున్న వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపు విధానంపై చర్చ కొనసాగుతోంది.

భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై టెక్ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజలకు స్టార్‌లింక్ అవసరమంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టుపై స్పందించిన మస్క్.. తమను కొంతమంది కుబేరులు అడ్డుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ప్రజలపై ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించేందుకే స్టార్‌లింక్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. అంతేకాదు.. ఇది భారత ప్రజల పట్ల జరుగుతున్న నేరం.. ఆ కుబేరులెవరో మీరే ఊహించండి అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అలాగే మణిపూర్‌లో మిలిటెంట్ల దగ్గర Starlink పరికరాలు దొరికాయన్న వార్తలపై కూడా ఎలాన్ మస్క్ స్పందించారు. భారత్‌పై ఉన్న Starlink శాటిలైట్ బీమ్స్ ఆఫ్‌లో ఉన్నాయని, అందువల్ల భారత్‌లో Starlink సేవలు అందుబాటులో లేవని స్పష్టం చేశారు. కాగా.. గ్రామాల్లో మొబైల్ కవరేజీ ఇంకా లేదంటూ డాడ్జ్‌డిజైనర్ అనే హ్యాండిల్ ఎక్స్‌లో చేసిన పోస్టుపై స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Unfortunately, we are being blocked by certain oligarchs in order to maintain their monopolistic chokehold on the Indian people. You can guess who they are …
This is a crime against the people of India!
— Elon Musk (@elonmusk) October 7, 2026
స్పందించిన కేటీఆర్..
ఇక మస్క్ ట్వీట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. భారత్‌లో స్టార్ లింక్‌ను అడ్డుకుంటున్న వారి పేర్లు బయటపెట్టాలని కోరారు. భారతదేశంలో ప్రభుత్వంపై ఎవరి పట్టు ఉందో దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Elon, Name and shame the Oligarchs
The Nation (India) wants to know who is got this stranglehold on our Government
— KTR (@KTRBRS) October 7, 2026
భారతదేశంలో సాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం ద్వారా కాకుండా, పరిపాలనాపరంగా కేటాయించాలని స్టార్‌లింక్ కోరుతోంది. వేగవంతమైన ఆశాజనక ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామీణ, దూరప్రాంతాలకు చవకైన, హై-స్పీడ్ సాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించడమే తమ ప్రధాన ధ్యేయమని స్టార్‌లింక్ స్పష్టం చేసింది. భారతీయ టెలికాం మార్కెట్‌లో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల అనుమతుల ప్రక్రియపై తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో ఎలాన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
స్టార్‌లింక్‌కు అడ్డంకులెవరు? మస్క్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
