Telangana: రెండు రోజుల్లో పెళ్లి.. సడెన్‌‌గా కనిపించకుండా పోయిన పెళ్లికొడుకు.. కట్ చేస్తే గుట్టపై..

మరో రెండు రోజుల్లో పెళ్లి. ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులు బిజీబిజీగా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. చివరకు ఏం జరిగింది..? అసలు పెళ్లి కొడుకు ఏమయ్యాడు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: రెండు రోజుల్లో పెళ్లి.. సడెన్‌‌గా కనిపించకుండా పోయిన పెళ్లికొడుకు.. కట్ చేస్తే గుట్టపై..
Tragedy Before Wedding In Nizamabad

Edited By: Krishna S

Updated on: Nov 12, 2025 | 10:27 AM

మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళ్‌పహాడ్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా అంతలోనే పెళ్లికొడుకు చేపూరి ప్రతాప్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. నారాయణ గౌడ్ చిన్న కుమారుడైన ప్రతాప్ గౌడ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. పెళ్లి పనులతో ఇంట్లో అంతా ఆనందోత్సవాల్లో ఉండగా అంతకుముందు రోజు సోమవారం సాయంత్రం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు.

కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో ప్రతాప్‌కు చెందిన బైక్ కనిపించడంతో ఆ దిశగా వెతకడం ప్రారంభించారు. గుట్టపై ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో ప్రతాప్ గౌడ్ మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. కొడుకు విగతజీవిగా ఉండడం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. మూడు రోజుల్లో కల్యాణ మండపంలో పెళ్లి కొడుకుగా కనిపించాల్సిన కొడుకు మరణించడం తల్లిదండ్రులకు, బంధువులకు తీరని బాధను మిగిల్చింది.

అనుమానాలు రేకెత్తిస్తున్న ఘటన

వివాహానికి కొద్ది రోజుల ముందు ఎలాంటి సమస్యలూ లేకుండా పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా పలు అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. ఇది ఆత్మహత్యా..? హత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..