TRS Plenary: గులాబీ మయమైన భాగ్యనగరం.. టీఆర్ఎస్ పార్టీ 21వ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం!

గులాబీ పండుగకు వేళైంది. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హైదరాబాద్‌ మహానగరం ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ వార్షికోత్సవానికి అంతా సిద్ధం చేశారు నేతలు.

TRS Plenary: గులాబీ మయమైన భాగ్యనగరం.. టీఆర్ఎస్ పార్టీ 21వ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం!
Trs Plinary
Follow us

|

Updated on: Apr 26, 2022 | 7:25 PM

TRS 21st Plenary:  గులాబీ పండుగకు వేళైంది. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హైదరాబాద్‌ మహానగరం ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ వార్షికోత్సవానికి అంతా సిద్ధం చేశారు నేతలు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, రేపు హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి. గులాబీ పార్టీ 21వ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం చేశారు నేతలు. ఇప్పటికే భాగ్యనగరం గులాబీమయంగా మారింది. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలుండటం, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు, ప్రశాంత్‌ కిశోర్‌ ఎంట్రీ, కేంద్రంతో పోరు, అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఈ ప్లీనరీకి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈ పండుగ జరగనుంది.

గతేడాది అక్టోబర్‌లోనే టీఆర్ఎస్ ద్విదశాబ్ది వార్షికోత్సవ ప్లీనరీ జరగ్గా, ఆరు నెలల వ్యవధిలో మరో ప్లీనరీని నిర్వహిస్తోంది టీఆర్ఎస్. ఎన్నికలకు ఇప్పట్నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తంచేసి, వారిలో ఉత్తేజం నింపేలా పార్టీ అధిష్ఠానం ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేల మందికి ఆహ్వానం పంపించారు. పురుషులు గులాబీ రంగు దుస్తులు, మహిళలు అదే రంగు చీరలతో హాజరు కావాలని పార్టీ సూచించింది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రతినిధుల నమోదు, ఆ తర్వాత స్వాగతోపన్యాసం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రసంగం ఉండనుంది.

ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే ఈ ప్లీనరీలో, తీర్మానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు రాజకీయ తీర్మానాలున్నట్లు సమాచారం. తెలంగాణపై కేంద్రం వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీ, దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలపై తీర్మాణాలు ఉండనున్నాయి. వీటితో పాటు టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు, భారీగా ఉద్యోగ నియామకాలు, విజయాలు, పురస్కారాలు, తదితర అంశాలపై తీర్మానాలుంటాయని అంటున్నారు కారు పార్టీ నేతలు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా, ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై వివాదం మొదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బ్యానర్లపై ఫైర్‌ అవుతోంది భారతీయ జనతా పార్టీ. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై సీరియస్‌ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అధికార పార్టీకి ఒకనీతి, ప్రతిపక్ష పార్టీలకు మరో నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. బ్యానర్లు తొలగించాలని వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే. అటు జీహెచ్ఎంసీ ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాజాసింగ్. అయితే, బీజేపీ నేతల కామెంట్స్‌పై ఇప్పటివరకు GHMC అధికారులు గానీ, టీఆర్‌ఎస్‌ నేతలు గానీ రియాక్ట్‌ అవ్వలేదు. కానీ, కొన్నిచోట్ల ఫ్లెక్సీల ఏర్పాటుపై అధికారులు చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.

Read Also…  Big News Big Debate: ఏపీలో బీప్‌ పాలిటిక్స్‌.. ఏపీలో ముందే ఎందుకీ BP పాలిటిక్స్‌?