Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి సరికొత్త ప్రచారం.. మంత్రివర్గంలోకి సురభి వాణీ దేవి..?

|

Mar 21, 2021 | 3:47 PM

Telangana Politics: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబాబాద్‌ గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సురభి వాణి దేవిని మంత్రి..

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి సరికొత్త ప్రచారం.. మంత్రివర్గంలోకి సురభి వాణీ దేవి..?
Surabhi Vani Devi
Follow us on

Telangana Politics: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబాబాద్‌ గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సురభి వాణి దేవిని మంత్రి పదవి వరించనుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకే ఆమెను ఎమ్మెల్సీగా బరిలో నిలబెట్టారా? పీవీపై ఉన్న అభిమానంతో వాణీ దేవిని సీఎం కేసీఆర్ తన కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారా? ఆమెకు మంత్రిగా నియమించి పీవీ శతజయంతుత్సవాల సందర్భంగా ఘన నివాళులు అర్పించాలని అధినేత యోచిస్తున్నారా? ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి కచ్చితంగా కాకపోయినా.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అవును.. ప్రముఖ విద్యావేత్త అయిన సురభి వాణీ దేవిని కేబినెట్‌లోకి తీసుకోవాలని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రంతో పాటు.. పార్టీకి కూడా లాభం చేకూరే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. ప్రముఖ విద్యావేత్త, విద్యాసంస్థల స్థాపకురాలు, కళాకారిణి అయిన సురభి వాణీ దేవి.. అంతకు మించి దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె కావడంతో అన్ని విధాలా మంచి జరుగుతుందని అధినేత కేసీఆర్‌తో పాటు.. పార్టీ ముఖ్యులు కూడా అభిప్రాయపడుతున్నారని టాక్ నడుస్తోంది.

ఆ కారణంగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో సురభి వాణి దేవి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారని అంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం నుంచి బరిలో నిలిచిన వాణి దేవి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌చందర్‌ రావుని మట్టికరిపించి ఊహించని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ గెలిచి తన తండ్రి పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులర్పించారు.

సురభి వాణి దేవి విజయం నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో సురభి వాణీ దేవి విజయంపై చర్చ జరుగుతోంది. తదుపరి మంత్రి వర్గ విస్తరణలో వాణి దేవిని కేబినెట్‌లోకి తీసుకుంటారనే టాక్ విపరీతంగా నడుస్తోంది. ఇప్పటికే వాణీ దేవిని గెలిపించుకుని పీవీకి ఘన నివాళులు అర్పించిన టీఆర్ఎస్.. ఆమెకు మంత్రి పదవి అప్పగించి శతజయంతుత్సవాల్లో భాగంగా పీవీకి మరింత గౌరవాన్ని ఇవ్వాలని భావిస్తోందని ప్రచారం సాగుతోంది.

ఇదిలాఉంటే.. 2018లో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. దాదాపు రెండు నెలల పాటు మంత్రివర్గమే లేకుండా పరిపాలన సాగించారు. ఆ తరువాత ఫిబ్రవరిలో తొలి విడత మంత్రి వర్గ విస్తరణ చేశారు. ఆ సమయంలో 10 మందిని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అప్పటికీ ఆరుగు మంత్రులను నియమించాల్సి ఉండగా.. కొంతకాలం తరువాత ఆయా శాఖలకు కూడా మంత్రులను నియమించారు. మొత్తంగా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ రెండు సార్లు మంత్రివర్గాన్ని విస్తరించారు.

అయితే ఇటీవలి కాలంలో మళ్లీ మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమె ఎమ్మెల్సీగా గెలుపొందిన సమయంలోనూ మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. అదలా ఉండగానే.. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. ఈ ఎన్నికల్లో పీవీ కూతురు సురభి వాణీ దేవి గెలుపొందడంతో మరోసారి అలాంటి ప్రచారమే జరుగుతోంది.

అయితే ఈసారి మాత్రం చాలా బలంగా ఆ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు బోగట్టా. ఆ కొత్త వారిలో సురభి వాణి దేవి కచ్చితంగా ఉంటారని టీఆర్ఎస్ శ్రేణులు బలంగా చెబుతున్నారు. కారణం.. విద్యావేత్త అయిన సురభి వాణీ దేవి తెలంగాణ పట్ల మంచి అవగాహన ఉండటమే.

పరిస్థితులను వెంటనే అవగాహన చేసుకుని పరిష్కారాలు చూపగల సామర్థ్యం ఆమె సొంతం. ఇంకా పీవీ కూతురైన వాణీ దేవికి మంత్రి ఇస్తే రాజకీయంగానూ టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. ఆ కారణంగానే వాణీ దేవిని మినిస్ట్రీలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి మంత్రి వర్గ విస్తరణ జరుగుందా? జరిగితే ఆమెకు మంత్రి పదవి కేటాయిస్తారా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.

Also read:

Chittoor District Corona Cases: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం.. వణుకు పుట్టిస్తోన్న వైరస్ వ్యాప్తి

Anek Movie : ‘అనేక్’ ముచ్చట్లు చెబుతున్న బాలీవుడ్ లవర్ బాయ్.. ఈ సినిమా తనకు వెరీ వెరీ స్పెషల్ అంటూ ఎమోషన్..