వృద్ధ రైతుపై ఏఎస్ఐ జులుం.. మెడ పట్టుకుని బయటకు గెంటివేత.. మంత్రి సీతక్క సీరియస్!

నిర్మల్‌ జిల్లాలో ASI ఓవరాక్షన్‌ చేశారు. వృద్ధ రైతును నిర్దాక్షిణ్యంగా గ్రామపంచాయతీ నుంచి బయటకు గెంటేశాడు ఎస్‌ఐ రామచంద్రం. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం పాత ఎల్లాపూర్‌లో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన రైతుని తహశీల్దార్‌ చాంబర్‌ నుంచి తోసేశాడు ఎస్‌ఐ. ఈ ఘటనపై టీవీ9 కథనాలకు స్పందించిన ప్రభుత్వం.. ఎస్‌ఐని సస్పెండ్‌ చేసింది.

వృద్ధ రైతుపై ఏఎస్ఐ జులుం.. మెడ పట్టుకుని బయటకు గెంటివేత.. మంత్రి సీతక్క సీరియస్!
Asi Misbehavior With Elderly Farmer

Edited By:

Updated on: Jun 04, 2025 | 4:54 PM

ఓ వృద్ద రైతుపై ఏఎస్ఐ ప్రవర్తించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భూ భారతి చట్టం ప్రజలకు చుట్టం అంటూ ప్రభుత్వం చెబుతుంటే.. రెవెన్యూ సదస్సులతో ప్రజల భూ సమస్యలు తీర్చేందుకు ప్రణాళికలు రచిస్తుంటే.. రెవెన్యూ సదస్సుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది‌. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ లో జరిగిన ఘటన. విషయం రాష్ట్ర సర్కార్‌కు దృష్టికి రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీని ఆదేశించారు.

భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా దరఖాస్తు స్వీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు ను ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు‌. అందులో భాగంగానే వృద్ధ రైతు అల్లెపు వెంకటి తన భూమి పట్టా కావడం లేదని తనకున్న మూడెకరాల భూమిలో రెండు ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని.. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తనకు న్యాయం చేయాలేదంటూ రెవెన్యూ సదస్సులో అధికారులను వేడుకున్నాడు.

ఈ సదస్సు జరుగుతున్న గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లి తహసిల్దారును, రెవెన్యూ సిబ్బందిని తన పట్టా విషయంలో నిలదీశాడు. దీంతో అధికారులు సిబ్బంది ఆ రైతుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ వృద్ధ రైతు ఎంతకు వినకపోవడంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ రామచందర్, ఆ రైతుపై జులుం ప్రదర్శించాడు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నుండి ఆ వృద్ధ రైతు మెడ పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు‌. ఈ ఘటనతో అక్కడున్న రైతులంతా షాక్ కు గురయ్యారు‌. వెంటనే తేరుకున్న స్థానికులు రైతును, ఏఎస్ఐని ఆపడంతో పరిస్థితి సర్ధుమణిగింది. అయితే ఆ ఘటనను అక్కడే ఉన్న టీవి9 రిపోర్టర్ రికార్డ్ చేయడంతో ఎక్స్ క్లూజివ్ గా కథనాన్ని ప్రసారం చేసింది టీవి9.

వీడియో చూడండి.. 

టీవి9 కథనంతో అంతే వేగంగా స్పందించింది రాష్ట్ర సర్కార్. ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క వివరాలు అడిగి తెలుసుకుని, ఆ వృద్ధ రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐని వెంటనే విధులనుండి తొలగించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్పీ జానకీ షర్మిల రైతు వెంకటిపై దాడి ఘటనకు ప్రయత్నించిన ఏఎస్ఐ రామచందర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. రైతులకు ప్రభుత్వం , పోలీసులు అండగా ఉంటారని.. ఈ ఘటన దురదృష్టకరమని.. మరోసారి ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..