Raja Singh: ఎవర్నీ కించపరచలేదు.. బీజేపీ షోకాజ్ నోటీసుపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇంకా ఏమన్నారంటే..?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనపై దురుద్దేశంతో కేసులు మోపిందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. తన వీడియోలో తాను కేవలం మునావర్‌ ఫారూఖీని మాత్రమే అనుకరించానని అన్నారు.

Raja Singh: ఎవర్నీ కించపరచలేదు.. బీజేపీ షోకాజ్ నోటీసుపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇంకా ఏమన్నారంటే..?
Mla Raja Singh (File Photo)

Updated on: Oct 10, 2022 | 7:07 PM

వివాదాస్పద వీడియో అనంతరం పీడీ చట్టం కింద అరెస్టై ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌- బీజేపీ నాయకత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు సమాధానం పంపారు. పార్టీ గౌరవానికి భంగం కలిగే చర్యలు ఏనాడు తాను చేపట్టలేదని రాజాసింగ్‌ తన వివరణలో పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నాలుగు పేజీల తన వివరణతో అనేక అంశాలను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తావించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనపై దురుద్దేశంతో కేసులు మోపిందని ఆరోపించారు. తన వీడియోలో తాను కేవలం మునావర్‌ ఫారూఖీని మాత్రమే అనుకరించానని అన్నారు. ఎంఐఎంను తాను ఎప్పుడు విమర్శించినా వాళ్లు దాన్ని మొత్తం ముస్లిం సమాజాన్ని విమర్శిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని రాజా సింగ్‌ పేర్కొన్నారు. ముస్లిం సమాజాన్ని తానేప్పుడు విమర్శించలేదని, వారి గురించి వ్యక్తిగత విమర్శలూ చేయలేదని తన వివరణలో రాజాసింగ్‌ తెలిపారు. మునావర్‌ ఫరూఖీ షో జరిగిన రోజు తనతో పాటు 500 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారని వెల్లడించారు.

మునవర్ ఫారూఖీ షో వద్దంటున్నా హైదరాబాద్ లోని నిర్వహించారని తెలిపారు. ఎంఐఎం కోసమే టీఆర్ఎస్ హిందూ దేవుళ్లను కించపరుస్తున్న మునావర్ ను ఇక్కడికి పిలిచారని.. దీంతో మనవర్ షో తర్వాత తాను ఒక వీడియోను విడుదల చేశానని రాజాసింగ్ తెలిపారు. అందులో ఎక్కడ ఏ మతాన్ని గానీ ఏ దేవుని గానీ కించపరచలేదంటూ వివరించారు. ఎంఐఎం కోసమే తన మీద పీడీయాక్ట్ పెట్టి తనను జైల్లో పెట్టారన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగంలోని సెక్షన్ XXV, 10 (a) కింద తాను ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడలేదని రాజాసింగ్ వివరణ ఇచ్చారు. బీజేపీలో కొనసాగే అవకాశాన్ని కల్పించాలని.. పార్టీకి దేశానికి సేవలందిస్తానని రాజాసింగ్ తన నాలుగు పేజీల లేఖలో ప్రస్తావించారు.

కాగా.. ఆగస్టు 20న హైదరాబాద్‌లో మునావర్ ఫారూఖీ షో అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన యూట్యూబ్ ఛాన‌ల్లో ఓ వీడియో విడుద‌ల చేశారు. దీనిలో ఓ వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఆందోళనలు జరిగాయి. దీంతో బీజేపీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. అయితే, కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజురు చేయ‌డంతోపాత‌బ‌స్తీలో మళ్లీ పెద్దఎత్తున ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. దీంతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం అతనిపై పలు కేసుల్లో పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి