Telangana: తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే.. ప్రారంభం వచ్చే నెలలోనే.. కేవలం 45 నిమిషాల్లోనే వెళ్లొచ్చు..
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో రాష్ట్రంలో మరో కొత్త హైవే వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పనులు పూర్తవ్వగా.. దసరా సందర్బంగా వచ్చే నెలలో ప్రారంభించే అవకాశముంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో ఈ హైవే నిర్మించారు.

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మరో కొత్త నేషనల్ హైవే రాష్ట్ర ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి అవ్వగా.. త్వరలోనే ప్రారంభోత్సవం చేసి ప్రయాణికులను అనుమతించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం హైవేవై ట్రయల్ రన్ జరుగుతుండగా.. రోడ్డుపై ఏమైనా లోపాలు, సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా వరంగల్-కరీంనగర్ మధ్య ఉన్న నేషనల్ హైవే-563ను 4 లైన్లుగా విస్తరించింది. దాదాపు 68.015 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉండగా.. నాలుగు వరుసలుగా తీర్చిదిద్దారు. అత్యంత ఆధునిక హంగులతో నిర్మించారు. ఇందుకోసం దాదాపు రూ.1,641 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో వరంగల్-కరీంనగర్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్ 563 కేవలం రెండు లైన్లుగా మాత్రమే ఉండేది. అంతేకాకుండా పలుచోట్ల గుంతలు ఉండటంతో పాటు రెండు లైన్ల రహాదారి మాత్రమే కావడంతో రద్దీ ఎక్కువగా ఉండేది. దీని వల్ల రహదారిపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) హైవే విస్తరణను నడుం బిగించింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్‌మాల ప్రాజెక్టులో కొత్తగా నాలుగు లైన్ల రహదారిగా విస్తరించింది. దీంతో వాహనదారులకు ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు రద్దీ తగ్గుతుంది. దీని వల్ల వరంగల్-కరీంనగర్ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి గంటన్నర పట్టేది. అయితే ఈ హైవే అందుబాటులోకి వస్తే కేవలం 45 నిమిషాల్లోనే వెళ్లవచ్చని అంటున్నారు.
ప్రారంభం ఎప్పుడంటే..?
ఈ హైవేను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లను షురూ చేశారు. అక్టోబర్ తొలి వారంలో ప్రారంభించే అవకాశముందని లేదా దసరా సందర్బంగా అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లగలిగే సామర్థ్యంతో ఈ రహదారిని నిర్మించారు. అంతేకాకుండా ఈ జాతీయ రహదారి రాకతో వరంగల్-కరీంనగర్ మధ్య దూరం కూడా తగ్గనుంది. 72 కిలోమీటర్ల నుంచి 68 కిలోమీటర్లకు తగ్గనుంది. ఈ హైవే నిర్మాణంలో భాగంగా 25 అండర్ పాస్‌లు నిర్మించగా.. 9 భారీ ఫ్లైఓవర్లు, 23 చిన్న వంతెనలు నిర్మించారు. శంకరపట్నం, మానకొండూరు, హుజూరాబాద్ వద్ద బైపాస్ అభివృద్ది చేశారు. గ్రామాలకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్లపై దృష్టి పెట్టారు. ఈ హైవేపై అత్యాధునిక సౌకర్యాలు ప్రవేశపెట్టారు. ప్రతీ కిలోమీటర్‌కు సీసీ కెమెరాలతో పాటు సోలార్ లైట్లు నెలకొల్పారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించేలా మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ కూడా ఉంది.
