Telangana: మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం..! తెలంగాణ ప్రభుత్వం పండుగలాంటి వార్త..!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు కేవలం మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు సౌకర్యం అమల్లో ఉండగా.. మరిన్ని వర్గాలకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్కీమ్ ప్రారంభించగా.. రోజూ లక్షలాది మంది మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతోండగా.. ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ, ఇంటర్ స్టేట్ సర్వీసులు, రాజాధాని బస్సుల్లో ఇది వర్తించదు. మహిళలు తమ ఆధార్ కార్డ్ చూపించి ఉచితంగా జర్నీ చేయవచ్చు. మహిళలకు మాత్రమే పరిమితమైన ఉచిత బస్సు ప్రయాణాన్ని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
వారికి కూడా ఫ్రీ బస్ సౌకర్యం
సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు పాస్‌లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉందని, ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. పథకం నిబంధనలు, అర్హతల గురించి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు పాస్ అందిస్తే.. దాని ద్వారా వృద్దులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు మహిళలకే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు పురుషులకు కూడా అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఈ నిర్ణయం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండటంతో అమలు చేయడానికి సమయం పట్టే అవకాశముంది. విధివిధానాలను రూపొందిందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం ఎలా..?
సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ఒక బస్ పాస్ అందిస్తారు. దీనిని ద్వారా ఛార్జీ చెల్లించకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అర్హులైన సీనియర్ సిటిజన్లు అందరికీ ఈ పాస్‌లు అందిస్తారు. ఈ పథకంపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నందున ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనేవి స్పష్టంగా చెప్పలేం. అటు మహాలక్ష్మి పథకం 2023 డిసెంబర్‌లో ప్రారంభమవ్వగా.. దీని ద్వారావ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపిస్తే ప్రత్యేకంగా మహాలక్ష్మి టికెట్ జారీ చేస్తారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు రవాణా ఖర్చులు తగ్గించేందుకు ఉచిత పాస్‌లు తెచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ఏయే వయస్సుల వారికి ఈ స్కీమ్ వర్తింపచేస్తారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. నిబంధనలు రూపొందించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
