Telangana: కళ్లు మూసి తెరిచేలోపే కాజేశాడు.. ఈ దొంగ రూటే సెపరేటు.. కావాలంటే మీరే చూడండి..

|

May 17, 2022 | 5:46 PM

దొంగతనం అనేది ఒక ఆర్ట్.. ఇక ఇతడు దానికి ఆర్టిస్ట్.. అసలు ఈ కేటుగాడు దొంగతనం చేశాడంటే పక్కన ఉన్నవారికి ఎలాంటి అనుమానం రాదు...

Telangana: కళ్లు మూసి తెరిచేలోపే కాజేశాడు.. ఈ దొంగ రూటే సెపరేటు.. కావాలంటే మీరే చూడండి..
Viral Video
Follow us on

దొంగతనం అనేది ఒక ఆర్ట్.. ఇక ఇతడు దానికి ఆర్టిస్ట్.. అసలు ఈ కేటుగాడు దొంగతనం చేశాడంటే పక్కన ఉన్నవారికి ఎలాంటి అనుమానం రాదు.. చాలా ఈజీగా కిల్లీ వేసుకొచ్చినట్లు కాజేసిన సొమ్మును పట్టుకొచ్చేస్తాడు. ‘ స్వామి రారా’ సినిమాలో హీరో అండ్ గ్యాంగ్ ఈజీగా దొంగతనాలు చేసినట్లు.. ఈ ఇద్దరు చాలా సులువుగా.. ఏమాత్రం కష్టపడకుండా బంగారు ఆభరణాలను దోచుకెళ్తారు. చివరికి నిర్ఘాంతపోవడం బాధితుడి వంతు అవుతుంది. ఇటీవల ‘స్వామి రారా’లో జరిగిన సీన్ తెలంగాణలోని భద్రాచలంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బూర్గంపాడుకు చెందిన సత్యవ్రత.. భద్రాచలంలోని యూబీరోడ్డులో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో దాచుకున్న బంగారు ఆభరణాలను నిన్న సాయంత్రం బయటికి తీశాడు. వాటిని ఓ సంచిలో పెట్టి.. తనతో పాటు తీసుకొచ్చిన పెద్ద సంచిలో దాన్ని ఉంచాడు. ఇక బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. కవర్లు కొనాలనుకున్న సత్యవ్రత మార్గం మధ్యలోని ఓ దుకాణం దగ్గర బైక్ ఆపాడు.. ఇదిలా ఉంటే.. సత్యవ్రత బంగారు ఆభరణాలు తీసుకున్న దగ్గర నుంచి ఓ ఇద్దరు యువకులు అతడ్ని గమనిస్తున్నారు. ఎప్పుడు సరైన సమయం దొరుకుతుందా.? ఎప్పుడు నగలు కాజేద్దామా.? అని కాచుకుని వెయిట్ చేస్తున్నారు. ఇక వారికి సరైన సమయం రానే వచ్చింది.

సత్యవ్రత కవర్ల కోసం దుకాణం దగ్గర బండి ఆపినప్పుడు.. ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ఓ దొంగ బైక్‌కు తగిలించిన సంచి నుంచి బంగారు ఆభరణాల బ్యాగును తియ్యాలని ప్రయత్నించాడు. చుట్టూ జనం.. ద్విచక్ర వాహనాలు వస్తుండటం.. పోతుండటంతో మొదటిసారి విఫలమయ్యాడు. అయితే సెకండ్ టైం ట్రై చేశాడు.. ఏమాత్రం భయపడలేదు.. దెబ్బకు బంగారు ఆభరణాల బ్యాగ్ చేతికొచ్చింది. అంతే.! ఇంకేముంది వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడుచుకుంటూ హాయిగా వెళ్లిపోయాడు. ఇక అప్పటివరకు ఈ తతంగం మొత్తం పక్కనే ఉండి చూస్తున్న మరో దొంగ.. తన ద్విచక్ర వాహనాన్ని పక్క రోడ్డు దగ్గర దొంగ ముందు ఆపగా.. ఇద్దరూ కూడా ఎంచక్కా బైక్‌పై తప్పించుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ తతంగం ముగిసిన కాసేపటికి తన బ్యాగ్‌లోని బంగారు ఆభరణాలు మాయమయ్యాయని బాధితుడు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్షా 70 వేలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు దొంగలించబడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.