గంగా పుష్కరాల కోసం ఇతర రాష్ట్రాలకో, సుదూర ప్రాంతాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తెలంగాణలోనూ పుష్కర ఏర్పాట్లు జరుగుతున్నాయ్. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రవహించే మంజీరా నదికి గరుడ గంగ పుష్కరాలు నిర్వహించేందుకు పుష్కలంగా ఏర్పాట్లు జరుగుతున్నాయ్.
గంగానది పుష్కరాల కోసం ఉత్తరాది రాష్ట్రాల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా… .తెలంగాణలోనూ గరుడ గంగ పుష్కరాల పేరిట ఉత్సవాలు మొదలయ్యాయ్. మహారాష్ట్రలో పుట్టి…కర్నాటక మీదుగా .. గౌడ్‌గావ్ దగ్గర తెలంగాణలోకి ప్రవహించే మంజీరా నదికి మరోసారి కుంభమేళా నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కర్ మండలం రాఘవపూర్ శివార్లలోని పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో ఈ గరుడ గంగ కుంభమేళా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి మే 5వ తేదీ వరకు.. 12రోజుల పాటు కుంభమేళా ఉత్సవం ఘనంగా జరగనుంది.
మంజీరా నది ఒడ్డున జరిగే ఈ మహా కుంభమేళాకు నాగసాధువులు, సాధుసంతులతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. 2010, 2013, 2018లోనూ ఇక్కడ కుంభమేళా ఘనంగా జరిగింది. ఈ దఫా కూడా అదే స్థాయిలో నిర్వహేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, నిర్వాహకులు. భక్తులకు అన్నదానం అందించేందుకు ప్రత్యేక షెడ్లు, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రత్యేక ఘాట్‌లను నిర్మించారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటోంది.
పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే ఈ పండగలో.. మొదటి, చివరి పన్నెండు రోజులు ప్రత్యేకమైనవిగా భావిస్తుంటారు. అందుకే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. గంగా హారతి కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..