గణపతి మండపాల్లో కొలువై భక్తులతో పూజలను అందుకున్న బుజ్జి గణపయ్య గంగమ్మ ఒడిలో చేరే సమయం దగ్గర పడుతుంది. నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28న హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిమజ్జనం జరగనుంది. ఈ టైమ్‌లో హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై నిరసనలు కూడా మొదలయ్యాయి. విఘ్నేశ్వరుడి నిమజ్జనానికి ఈ విఘ్నాలేంటి?
వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీపీతో పాటు, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అమలు చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం.. 74 మినీ చెరువులను ఏర్పాటు చేసింది. వాటిల్లో 22 భారీ పోర్టబుల్ వాటర్ ట్యాంకులు కాగా.. 23 ప్రాంతాల్లో కొలనులు, 27 ప్రదేశాల్లో బేబీ పాండ్స్ అందుబాటులో ఉంచింది. వాటిల్లోనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయాలనేది హైకోర్ట్ ఆదేశాల సారాంశం.
అయితే హైకోర్టు ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గణేష్ మండపాల నిర్వాహకులు. అంతేకాదు ట్యాంక్ బండ్‌పై ఆందోళన చేశారు. హై కోర్ట్ తీర్పును పుణ:సమీక్షించాలని కోరుతున్నారు. హిందువుల పండగకే ఆoక్షలు సృష్టిస్తున్నారని ఆందోళకు దిగారు. ఈ నెల 28న ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్‌తో పాటు నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మరి గణేష్ మండపాల నిర్వాహకులు హైకోర్ట్ నిబంధనలు పాటిస్తారా.. లేదా అనేది చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..