AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?

ఒకప్పుడు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాలు సులభంగా స్థలం కొనగలిగేవి. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో మారిపోయింది. ఒకప్పుడు గజం రూ.1800 మాత్రమే ఉన్న హైటెక్ సిటీ ప్రాంతం.. ఇప్పుడు లక్షల్లో పలుకుతోంది. ఐటీ బూమ్, మెట్రో విస్తరణ, గ్లోబల్ కంపెనీల రాకతో నగర భూముల ధరలు ఆకాశాన్ని తాకగా.. సొంతింటి కల మాత్రం మధ్యతరగతికి మరింత దూరమవుతోంది.

Hyderabad: 1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
Hitech City
Ram Naramaneni
|

Updated on: May 27, 2026 | 4:29 PM

Share

ఒకప్పుడు హైదరాబాద్‌లో స్థలం కొనడం అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబానికీ సాధ్యమే. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో మారిపోయింది. ఒకప్పుడు నగర శివార్లుగా భావించిన ప్రాంతాలే ఇప్పుడు దేశంలో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ జోన్లుగా మారాయి. క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్ రెడ్డి వెల్లడించిన పాత ధరలు ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. 1987 ప్రాంతంలో సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లో చదరపు అడుగు రూ.225 మాత్రమే ఉండేదట. పంజాగుట్టలో చదరపు అడుగు రూ.260 వరకు ఉండేదని చెప్పారు. ఇక 1997 సమయంలో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ చుట్టుపక్కల గజం రూ.1800 మాత్రమే ఉండేదట.

కానీ ఇప్పుడు అదే ప్రాంతం దేశంలోనే అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్లలో ఒకటిగా మారింది. ప్రస్తుతం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో గజం ధరలు సగటున రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండగా.. ప్రైమ్ కమర్షియల్ జోన్లలో ఇంకా ఎక్కువ పలుకుతున్నాయి.

1998 తర్వాత ఐటీ రంగం విస్తరణ హైదరాబాద్ భవిష్యత్తునే మార్చేసింది. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌కు రావడం ప్రారంభించాయి. ఉద్యోగాల కోసం దేశం నలుమూలల నుంచి యువత నగరానికి చేరుకుంది. అదే రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను విపరీతంగా పెంచింది. ఒకప్పుడు ఖాళీ భూములుగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కొకాపేట్, నానక్‌రామ్‌గూడ లాంటి ప్రాంతాలు ఇప్పుడు కోట్ల మార్కెట్‌గా మారిపోయాయి.

2026 మార్కెట్ అంచనాల ప్రకారం.. హైటెక్ సిటీ ప్రాంతంలో గజం భూమి ధర సగటున రూ.1.5 లక్షల – రూ.2.5 లక్షలు వరకు ఉంది. గచ్చిబౌలిలో ప్రస్తుతం గజం రూ.1 లక్ష – 2 లక్షలు వరకు పలుకుతోంది. కొకాపేట్‌లో అయితే 2 లక్షలు దాటేసింది. జూబ్లీ హిల్స్‌లో రూ.2.5 లక్షల – రూ.3.5 లక్షలు వరకు ఉంది. మాదాపూర్ ప్రాంతంలో రూ.70 వేల – రూ.1.1 లక్షలు వరకు ఉంది. అపార్ట్‌మెంట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైటెక్ సిటీలో చదరపు అడుగు ధర సగటున రూ.10,000 నుంచి రూ.16,000 వరకు ఉందని రియల్ ఎస్టేట్ మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి.

ఇటీవలి కాలంలో కొకాపేట్, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలాల్లో ఎకరం రూ.100 కోట్లకు పైగా పలికింది. ఆ ప్రభావం చుట్టుపక్కల 5–10 కిలోమీటర్ల ప్రాంతాలపై పడింది. చిన్న రోడ్డు, మెట్రో, ఫ్లైఓవర్, ఐటీ పార్క్ ప్రకటన వచ్చినా వెంటనే రేట్లు పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు జీతం సేవ్ చేసి ప్లాట్ కొనగలిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అయితే నగరంలో సొంత ఇల్లు కొనడం మధ్యతరగతికి పెద్ద సవాల్‌గా మారుతోంది. బ్యాంక్ లోన్లు, EMIలు, పెరుగుతున్న నిర్మాణ వ్యయం వల్ల చాలామంది నగర శివార్ల వైపు వెళ్లాల్సి వస్తోంది.

రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం.. రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, డేటా సెంటర్లు, గ్లోబల్ కంపెనీల విస్తరణ లాంటి కారణాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక హౌసింగ్ పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us