Karimnagar: వావిలాలపల్లిలో హల్‌చల్ చేసిన అనుకోని అతిథి.. ఆశ్చర్యపోయిన జనం..

కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో అరుదైన అతిథి ప్రత్యక్షమైంది. కథల్లో మాత్రమే విన్న నక్కను నిజంగా చూడటం స్థానికులకు విశేష అనుభూతిని కలిగించింది. రెండు రోజులుగా సోలార్ కార్యాలయం వద్ద తిరుగుతోన్న ఆ జంతువును తొలుత పిల్లి అనుకుని ఆహారం పెట్టారు ...

Karimnagar: వావిలాలపల్లిలో హల్‌చల్ చేసిన అనుకోని అతిథి.. ఆశ్చర్యపోయిన జనం..
Fox

Edited By: Ram Naramaneni

Updated on: Nov 26, 2025 | 2:55 PM

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో ఓ నక్క కనిపించడం కలకలం రేపింది. పలు కథల్లో, పురాణాల్లో మాత్రమే విన్న నక్కను నిజంగా చూడటం స్థానికులకు విశేష అనుభూతిని కలిగించింది. గత రెండు రోజులుగా వావిలాలపల్లిలోని ఓ సోలార్ విద్యుత్ కార్యాలయం వద్ద ఈ జంతువు తిరుగుతూ కనిపించింది. తొలుత స్థానికులు దీన్ని పిల్లి అనుకొని ఆహారం, నీళ్లు పెట్టారు. అయితే సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. వచ్చి చూసి దాన్ని నక్క అని గుర్తించారు.నక్కను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది చాకచక్యంగా తప్పించుకుని శివారు ప్రాంతం వైపు పరుగెత్తింది. ఈ నక్క జనావాసాల్లోకి ఎలా చేరిందనే విషయంలో స్పష్టత లేకపోయినా.. కొండలు, గుట్టలు క్రమంగా మాయమవుతుండడంతో వన్యజీవులు మానవ ప్రాంతాలకు చేరుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

అరుదైన నక్కను దగ్గరగా చూసే అవకాశమొచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నక్క తోకను తొక్కినా, నక్క ఇంటికి వచ్చినా అదృష్టం కలుగుతుందని ప్రజల్లో నమ్మకం ఉండటంతో.. అది తమ కార్యాలయానికి వచ్చినందుకు యజమాని జలేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వ్యాపారంలో మంచి జరుగుతుందనే నమ్మకం కలిగిందని ఆయన చెబుతున్నారు. స్థానికులు కూడా ఇదే మొదటిసారి నక్కను ప్రత్యక్షంగా చూశామని చెబుతూ, ఈ అరుదైన అతిథిని సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వావిలాలపల్లిలో నక్క ప్రత్యక్షం… గ్రామంలో పెద్ద చర్చగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..