మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయం అంటే అత్యంత ఇష్టం. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఆయన ఎప్పుడు వ్యవసాయం చేయడం మాత్రం ఆపలేదు. ఒకవైపు ఉధృతంగా ఉద్యమం చేస్తూనే అంతే ఉత్సాహంగా వ్యవసాయం కూడా చేసేవారు. ఉద్యమ కాలంలో కూడా సమయం దొరికిన ప్రతిసారి ఫామ్ హౌస్‌కి వెళ్లి అగ్రికల్చర్ పనులను పర్యవేక్షించేవారు. అంతెందుకు ఉద్యమ ప్రణాళికలకు ఒక సమయంలో కేంద్ర బిందువు కేసీఆర్ ఫామ్ హౌస్ అయింది. అప్పట్లో కొత్త వంగడంగా ఆలుగడ్డలు పండించి రైతులను కూడా ఆ కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని ప్రోత్సహించారు. ఆ తర్వాత అదో వివాదంగా మారింది.
ఇక 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఎప్పుడు సమయం దొరికినా ఫామ్ హౌస్‌కి వెళ్లేవారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఈ పదేళ్లు ఆయనకు వ్యవసాయంపై పూర్తి సమయం దృష్టిపెట్టే అవకాశం దొరకలేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయనకున్న తీరిక సమయాన్ని వ్యవసాయంపై గడుపుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుంటి ఎముక విరగడంతో కొద్ది నెలలు పూర్తిస్థాయిలో ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఆ మూడు నెలలు పూర్తిస్థాయిలో ఆయనకు పంటలే కాలక్షేపంగా మారాయి. దీంతో ఫామ్‌హౌస్‌ని పూర్తిస్థాయిలో రీమోడల్ చేశారు.
కొత్త కొత్త వరి వంగడాలను తెప్పించి నాట్లు వేయించారు. అవి కూడా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. గ్లూకోస్ కంటెంట్ చాలా తక్కువగా ఉండే షుగర్ ఫ్రీ రైస్‌ని ఇప్పుడు కేసీఆర్ పండిస్తున్నట్లుగా సమాచారం. వీటితోపాటు రకరకాల పండ్ల మొక్కలు, అన్ని సీజన్లలో దొరికే ఫ్రూట్స్ ఆర్గానిక్ కూరగాయలు ప్రత్యేకంగా దగ్గరుండి చూసుకుంటున్నారు కేసీఆర్. ఆయన కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడు ఫామ్ హౌస్‌కి మాత్రం దూరం కాలేదు. వ్యవసాయంపై అంత మక్కువ కేసీఆర్ కు.. ఇప్పుడు దొరుకుతున్న వెసులుబాటును ఆయన పూర్తిస్థాయిలో తనకు ఇష్టమైన వ్యవసాయంపై గడుపుతున్నారు. ఫామ్ హౌజ్ మొత్తం ఇటీవల సాయిల్ టెస్ట్ చేయించారు కేసీఆర్. ఎక్కడ సారవంతమైన భూమి ఉంది.. ఎలాంటి భూమిలో ఏ పంటలు వేయచ్చు అనే దానిపై అక్కడున్న పనివాళ్లకు ఒక అవగాహన కల్పించారట. వర్షాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నడంతో.. తేలికపాటి వర్షాల్లో కూడా కమర్షియల్ క్రాప్స్ ఎలా పండించాలి అనే అంశంపై కేసిఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..