Ramesh Rathod: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారు

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటీన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌ను పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేయడంతో.. ఆయన కూడా కాంగ్రెస్‌ను కాదనుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రమేశ్‌రాథోడ్.. బీజేపీలో చేరిపోయారు. రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు.
షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. అతను 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2006–2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 2009–2014 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఖానాపూర్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేశ్ రాథోడ్. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. జూన్ 2021 లో ఈటెల రాజేందర్ తోపాటు భారతీయ జనతా పార్టీలో చేరారు.
బండి సంజయ్ సంతాపం..
రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్న బండి సంజయ్.. రమేష్ రాథోడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నని బండి సంజయ్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
