నిర్మల్ జిల్లాలో కొత్త గొడవ నడుస్తోంది. అటవి శాఖ వర్సెస్ పంచాయితీరాజ్ శాఖల మధ్య మాటలతో మొదలైన వివాదం.. చర్యల వరకు వచ్చింది. రెండు శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపం ఉద్యోగులను రోడ్డు మీదకు తెచ్చింది. రెండు రోజులుగా సాగుతున్న ఆందోళనలో చెట్ల కిందనే అటవిశాఖ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో ఈ గొడవ జరుగుతోంది. అది కూడా అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సొంత జిల్లాలో వివాదం సాగుతోంది. కడెం అటవి క్షేత్ర కార్యాలయానికి చెందిన పన్ను బకాయిలు 12 ఏళ్లుగా చెల్లించడం లేదని మండల అధికారులు ఆరోపిస్తున్నారు. గతంలో లక్షా 33వేల 588 రూపాయలు చెల్లించాలంటూ DPO శ్రీలత పేరు మీద కడెం FRO ఆఫీస్‌కు నోటీసులు జారీ చేశారు.
పంచాయితీరాజ్ అధికారుల నోటీసులకు స్పందన రాకపోవడంతో నిన్న కడెం FRO కార్యాలయాన్ని సీజ్ చేశారు. దీంతో నిన్నటి నుంచి ఫారెస్ట్ అధికారులు చెట్టు కిందనే డ్యూటీ చేస్తున్నారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇది కక్ష సాదింపు చర్యలో భాగంగానే బకాయిల సాకు చూపి ఆఫీస్‌ను సీజ్ చేశారంటున్నారు అటవిశాఖ అదికారులు. కడెం పరిదిలోని కోర్ ఏరియాలో క్రీడా స్థలం, స్మశాన వాటికల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడం, జిల్లా కలెక్టర్‌కు అటవిశాఖ జీపు సమకూర్చ లేదన్న కోపంతోనే ఇలా చేశారంటున్నారు అటవి శాఖ అధికారి కోటేశ్వరరావు.
ఈ విషయంపై స్పందించిన డీపీఓ శ్రీలత.. ఫారెస్ట్ అధికారులపై కక్ష సాధింపు చర్యలు అంటూ ఏమి లేవంటున్నారు. అన్ని శాఖలకు కూడా నోటీసులు సర్వ్ చేశామన్నారు.