ఆప‌రేష‌న్ హంటింగ్‌: వర్నిలో క‌ల‌క‌లం రేపిన హైదరాబాదీల వేట.. అడవిని గాలిస్తున్న వేటగాళ్ల గుట్టు రట్టు

| Edited By: Pardhasaradhi Peri

Dec 21, 2020 | 2:35 PM

నిజామాబాద్ జిల్లా వర్నిలో హైదరాబాదీల వేట కలకలం రేపింది. అడవిని గాలిస్తున్న వేటగాళ్ల గుట్టు రట్టయ్యింది. ఐదుగురి అరెస్ట్‌తో.. హైదరాబాద్‌లోనూ డొంక కదిలింది. వేటగాళ్ల చేతిలో...

ఆప‌రేష‌న్ హంటింగ్‌: వర్నిలో  క‌ల‌క‌లం రేపిన హైదరాబాదీల వేట.. అడవిని గాలిస్తున్న వేటగాళ్ల గుట్టు రట్టు
Follow us on

– వ‌ర్నిలో వేట‌గాళ్లు, ఐదుగురి అరెస్టు
– అడ‌వి జంతువుల కోసం నిజామాబాద్ అడవులే టార్గెట్‌
– విదేశాల నుంచి గ‌న్స్ తెప్పించి వేట‌
– వేటగాళ్ల నుంచి ఆయుధాలు స్వాధీనం

 

నిజామాబాద్ జిల్లా వర్నిలో హైదరాబాదీల వేట కలకలం రేపింది. అడవిని గాలిస్తున్న వేటగాళ్ల గుట్టు రట్టయ్యింది. ఐదుగురి అరెస్ట్‌తో.. హైదరాబాద్‌లోనూ డొంక కదిలింది. వేటగాళ్ల చేతిలో నాటు తుపాకులు కాదు.. ఫారిన్‌ ఆయుధాలున్నాయి. అవి ఎలా వచ్చాయ్‌..? వాళ్ల వెనుక ఎవరున్నారు? అటవీ ప్రాంతంలో ఎన్నాళ్లుగా వేటాడుతున్నారు? నిజామాబాద్‌ జిల్లా వర్ని ప్రాంతంలో పట్టుబడ్డ వేటగాళ్లను చూస్తే ఈ ప్రశ్నలు కలుగకమానవు. వేటగాళ్ల చేతిలోని తుపాకులను చూసి షాకవడం ఫారెస్ట్‌ ఆఫీసర్ల వంతైంది.

వీకెండ్‌లో అడవిలో వేటాడుతున్న ముఠా ఆట కట్టించారు అటవీశాఖ అధికారులు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామంలో వేటకు వెళ్లిన వాళ్లను పక్కా సమాచారంతో పట్టుకున్నారు. వర్ని శివారులో ఉన్న అఫెండి రైస్ మిల్లుపై అధికారులు దాడి లుక్‌మాన్ అఫెండి సహా అతని సోదరుడు.. మరో ముగ్గురు వేటగాళ్లను ప‌ట్టుకున్నారు. నిందితుల వ‌ద్ద నుంచి రెండు రైఫిల్స్‌, సైలెన్సర్స్‌, బుల్లెట్లు, టెలిస్కోప్‌, సెర్చ్ లైట్స్‌, బైనాక్యూలర్స్‌, క‌త్తులు, టార్చ్‌లైట్స్ త‌దిత‌ర వ‌స్తువుల‌ను, టాటా స‌ఫారీ వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, వర్నిలో లుక్‌మాన్ అఫెండి రైస్‌ మిల్ ఉంది. దానికి సమీపంలో ఉన్న అడవుల్లో వీకెండ్‌లో వేట సాగిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈసారి కూడా దుప్పుల కోసం వేటకు వెళ్లగా అవి దొరకలేదు. అడవిలో కనిపించిన కుందేలును వేటాడి.. రైస్‌మిల్లుకు వచ్చేశారు. ఇదే సమయంలో దాడి‌ చేసిన అధికారులు.. వారి దగ్గర నుంచి కుందేలు మాంసంతో పాటు.. ఆయుధాలను సీజ్‌ చేశారు.

ఐదుగురు వేట‌గాళ్లు అరెస్టు

అటు హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌లోని అఫెండి ఇంట్లోనూ సోదాలు చేశారు అధికారులు. రిఫ్రిజిరేజర్‌లో దాచిపెట్టిన వేట మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది ఏ జంతువుదన్నది తేల్చడానికి శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపించారు. దీనికి సంబంధించి అట‌వీ జంతువుల వేటాడిన‌ హైద‌రాబాద్‌కు చెందిన ఐదుగురిని హైద‌రాబాద్ విజిలెన్స్ బృందం అరెస్టుచేసింది. లుకుమాన్ అఫెండి, ఇమ్రాన్ అఫెండి, షారూక్ ఖాన్‌, షైక్ రాజ్ హైమ‌ద్‌, జ‌మీలుద్దీన్‌ల‌ను అరెస్టు చేశారు.

విదేశాల నుంచి గ‌న్స్ ..

కాగా, అధికారుల కళ్లుగప్పి విదేశాల నుంచి గన్స్ తెప్పించి వేటాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అలాగే వేటాడే సమయంలో గన్ పేల్చినప్పుడు శబ్దం రాకుండా సైలెంట్ ఆప్షన్ పెట్టినట్లు తేలింది. నిజామాబాద్ అడవులనే టార్గెట్ గా చేసుకున్న హైదరాబాదీలు జింకలు, కృష్ణ జింకలు, చిరుతలు, అడవి పందులు, కుందేళ్లను వేటాడడమే వీరి పని. వర్ని, బడా పహాడ్, జాకోరా ప్రాంతాల్లో వేటాడుతున్నట్లు గుర్తించారు. వీటిని వేటాడేందుకు ఆర్మీ గన్స్ సైతం వాడుతున్నట్లు తెలుస్తోంది.