నవమాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పసికందును విక్రయించిన ఘటన హైదరాబాద్ మహానగరంలో కలకలం రేపుతోంది.
అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి ఆ చిన్నారిది. తండ్రి లాలనకూ నోచుకోని దుస్థితి ఆ శిశువుది. తల్లిదండ్రుల సంరక్షణలో హాయిగా ఎదగాల్సిన ఆ పసిపాపను కన్న తండ్రే అంగట్లో బొమ్మలా ఇతరులకు అమ్మే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన ఈ అమానుష ఘటన ఆడపిల్లల పట్ల వేళ్లూనుకొన్న వివక్షకు అద్దం పడుతోంది. మగ పిల్లాడు పుడితే సంబురాలు చేసుకుంటూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించే వాళ్లు చాలామందే ఉన్నారు. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే వద్దనుకుంటున్నారు. పురిటిలోనే వదిలేసి వెళ్లిపోతున్న పరిస్థితి. మరికొందరు తమకు ఆడబిడ్డ వద్దు అంటూ కన్న తల్లిదండ్రులే వేరే వాళ్లకు విక్రయిస్తున్నారు.
తాజాగా పేదరికం ఆ కుటుంబాన్ని ఎంతటికైనా తెగించేలా చేసింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఏకంగా ముక్కు పచ్చలారని శిశువును విక్రయించేశారు. హైదరాబాద్ పాతబస్తీలో నవజాతి శిశువు అమ్మకం కలకలం రేపింది. బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్ నగర్ ప్రాంతంలో అసిఫ్, అస్మా దంపతలు నివసిస్తున్నారు. అసిఫ్, తన భార్య అస్మాను బెదిరించి వారి 18రోజుల పాపను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్‌కు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నాడు. లక్ష రూపాయలకు చాంద్ సుల్తానా అనే మహిళ ద్వారా విక్రయించాడు. వెంటనే అస్మా బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు 24 గంటల లోపే ఛేదించారు. 18రోజుల పసికందును కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి రక్షించి తల్లికి అప్పగించారు. ఈ కేసులో బాలిక తండ్రి అసిఫ్, మధ్యవర్తి చాంద్ సుల్తానా, బాలికను కొన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 24గంటల్లో కూతురు అస్మా బేగం కు చేరడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. పోలీసులకు బాధిత కుటుబ సభ్యులు, స్థానికు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…