
సాధారణంగా ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకే వృత్తిలో ఉండటం చూస్తుంటాం. కానీ విధి నిర్వహణలో తండ్రీకొడుకులు ఒకే బస్సులో కలిసి పనిచేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన, మధురమైన సన్నివేశం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. హుస్నాబాద్ బస్టాండ్‌లో శుక్రవారం ఒక బస్సు ప్రయాణికులందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ బస్సు స్టీరింగ్ పట్టుకొని డ్రైవర్ సీట్లో తండ్రి ఉంటే.. ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ కొడుకు కండక్టర్‌గా కనిపించారు. బంధనాపురం ఎల్లయ్య హుస్నాబాద్ డిపోలో గత 34 ఏళ్లుగా డ్రైవర్‌గా సేవలందిస్తున్నారు. ఆయన కుమారుడు ప్రేమ్ అదే డిపోలో కండక్టర్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా వీరిద్దరికీ ఒకే బస్సులో డ్యూటీ పడటంతో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ఎల్లయ్య సాదాసీదా డ్రైవర్ కాదు. తన 34 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఒక్క చిన్న ప్రమాదం కూడా చేయని యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్‌గా ఆయనకు పేరుంది. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా ఎన్నో ఉత్తమ అవార్డులను కూడా అందుకున్నారు. తన పదవీ విరమణ దగ్గర పడుతున్న సమయంలో ఇలా తన కొడుకుతో కలిసి ఒకే బస్సులో ప్రయాణించడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా ఎల్లయ్య భావిస్తున్నారు. బస్సులో తండ్రీకొడుకుల జోడీని చూసిన ప్రయాణికులు ముచ్చటపడ్డారు. క్రమశిక్షణ గల తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అదే సంస్థలో కొడుకు కూడా బాధ్యతలు చేపట్టడం చూసి అందరూ అభినందించారు. హుస్నాబాద్ ఆర్టీసీ చరిత్రలో ఇదొక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని తోటి సిబ్బంది చెబుతున్నారు.