Telangana: లింక్ రోడ్డును కబ్జా చేసి బండరాళ్లు పెట్టాడు.. ఆ తర్వాత సీన్ చిరిగి సితారయ్యింది..
చిన్న నుంచి పెద్దల వరకు కోరికలు ఉండడం సహజమే. తమ కోరికలు తీర్చాలని, తమకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలు, అధికారులను ప్రజలు కోరడం కూడా సాధారణమే. తమ గ్రామానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని కొందరు రైతులు అధికారులను కోరారు. బస్సులు, రైళ్లు కోసం వీరి డిమాండ్ కాదు..

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం బహద్దూర్‌పేట గిరిజన రైతులు కొన్నేళ్లుగా గ్రామ శివారులోని భూములను సేద్యం చేసుకుంటున్నారు. తమ భూముల్లోకి వెళ్ళేందుకు బహద్దూర్‌పేట నుంచి చిన్నకందుకూరు గ్రామాన్ని కలిపే లింకు రహదారిని వినియోగించుకుంటున్నారు. అయితే ఇటీవల కొందరు రెండు గ్రామాల మధ్య ఉన్న లింక్ రోడ్డును అక్రమంగా కబ్జా చేశారని, రహదారికి అడ్డంగా పెద్ద బండరాళ్లను పెట్టి ఫెన్సింగ్ వేయించారు. దీంతో తమ ఇళ్లు, పంట పొలాల్లోకి వెళ్లేందుకు గిరిజన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం.. పంట పొలాల్లోకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక పంటలు విత్తుకునేందుకు, వేసిన పంటలను కాపాడుకునేందుకు గిరిజన రైతులు నానా కష్టాలు పడుతున్నారు. తమ వ్యవసాయ భూముల్లోకి, ఇళ్లలోకి వెళ్లకుండా దారి కబ్జా చేశారని.. తమకు రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను గిరిజన రైతులు కోరుతున్నారు. ఇందుకోసం తమకు ప్రభుత్వ నిధులతో హెలికాప్టర్ కొనిచ్చి ఆదుకోవాలని బహద్దూర్‌పేట రైతులు జిల్లా అధికారులను కోరుతున్నారు. అక్రమంగా రెండు గ్రామాల మధ్య ఉన్న లింక్ రోడ్డును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు దారి సౌకర్యం కల్పించాలని కలెక్టరేట్ ఆవరణలో ప్లకార్డులను ప్రదర్శించారు. దారి కబ్జా కావడంతో ఇళ్లలోకి వెళ్లేదారి లేక ఇతరుల ఇళ్ల వాకిట తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బహద్దూర్‌పేట రైతుల వింత కోరికను విని అధికారులు షాక్ తిన్నారు. రెండు గ్రామాలను కలిపే లింక్ రోడ్డును పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
