- Telugu News Photo Gallery Telangana's Bonalu Festival Celebrated Grandly in Delhi A Cultural Showcase
Delhi Bonalu: హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు.. ఇండియా గేట్ వద్ద విరిసిన తెలంగాణ సంస్కృతీ శోభ..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వాటి నుంచి బోనాలు, బతుకమ్మ సహా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ పండుగలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జరగని వేడుకలు సైతం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో వైభవంగా తెలంగాణ పండుగలు ఢిల్లీలో జరుగుతున్నాయి. జూన్ 30 సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు.
Updated on: Jul 09, 2025 | 7:02 PM

దేశ రాజధాని ఢిల్లీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ధూంధాంగా నిర్వహించారు.11 ఏళ్లుగా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారికంగా బోనాల వేడుకలను నిర్వహిస్తోంది.. మూడు రోజుల వేడుకల్లో భాగంగా రెండో రోజు బోనాల సంబరాలు అంబరాన్నంటాయి...

జూన్ 30 సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. లాల్ దర్వాజ బోనాలు మంగళవారం ఇండియా గేట్ నుండి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో, సాంస్కృతిక నృత్యాల మధ్య అత్యంత అట్టహాసంగా జరిగింది.

ముందుగా సింహవాహినీ ఆలయ కమిటీ సభ్యులు ఇండియా గేట్ వద్ద అమ్మవారి ఘటాలకు ప్రత్యేక వూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా.శశాంక్ గోయల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

అనంతరం 150 మంది సాంస్కృతిక శాఖ కళాకారుల సంప్రదాయ పూర్వక డప్పుల మోతలు, పోతురాజుల ఆటలు, ఒగ్గుడోలు కళాకారుల నాట్యాలు, పూర్ణ కుంభాల మధ్య సాగిన అమ్మ వారి ఘటాల ఊరేగింపు ఇండియా గేట్ వద్ద ఉన్న వివిధ రాష్ట్రాల ప్రజలతో పాటు అక్కడకు వచ్చిన విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షించింది.

పలువురు విదేశీయులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ, బోనాల పండుగ వైభవాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో బంధించడమే కాదు, తెలంగాణ కళారూపాలపై ప్రశంసలు కురిపించారు. ఊరేగింపు అనంతరం తెలంగాణ భవన్‌లో ఘట స్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొనడం, కళాకారుల వాయిద్యాలతో కూడిన సాంస్కృతిక నృత్యాలు, పోతురాజుల ఆటలతో తెలంగాణ భవన్ వాతావరణం ఉత్సాహ భరితంగా మారింది.

శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇండియా గేట్ వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో బోనాల ఊరేగింపును నిర్వహించడం తెలంగాణ అందరికీ గర్వకారణమన్నారు..తెలంగాణ పౌరులు మాత్రమే కాకుండా, ఢిల్లీలోని ఇతర రాష్ట్రాలవారు, విదేశీయులకూ మన సంస్కృతిని పరిచయం చేసే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు..

బుధవారం చివరిరోజు ఉదయం బోనాల వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తో పాటు మరొకొందరు ప్రముఖులు హాజరు కానున్నారు ..11:00 గంటలకు అమ్మవారికి బంగారు బోనం సమర్పణ, సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు.. సాయంత్రం 6:00 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాల మహోత్సవ ముగింపు ఉంటుంది.. బోనాల ముగింపు వేడుకల్లో తెలంగాణ కళారూపాలను ప్రతిబింబించే సాంస్కృతిక నృత్యాలు దాదాపు 150 మంది కళాకారులు పాల్గొంటున్నారు.
