
20 వేల రూపాయల విలువచేసే మామిడి పంటను.. జస్ట్ 500 రూపాయలకు అడిగితే ఏ రైతుకైనా కడుపు మండదా చెప్పండి. ఇక్కడా అదే జరిగింది.. మామిడి పంటను మార్కెట్లో అమ్మకానికి తీసుకువచ్చిన రైతు కంట్లో కారం కొట్టేలా ప్రవర్తించారు వ్యాపారులు, దళారులు. పుక్కటికి దోచుకునేలా తయారైన దళారులు, వ్యాపారులు 20 వేల రూపాయల విలువ చేసే పంటను 500 రూపాయలకు అడగడంతో ఆగ్రహం చెందిన ఆ బాధిత రైతు ఇలా నిరసన తెలిపి.. అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సతీష్ అనే రైతు ఐదు ఎకరాలలో మామిడి పంట వేశాడు. ఈ సారి పంటంతా వర్షాల వల్ల నేలరాలి ఊహించిన విధంగా నష్టం వాటిల్లింది. మిగిలిన 7 టన్నుల మామిడి పంటను లక్ష్మీపురం ఫ్రూట్ మార్కెట్లో అమ్మకానికి తీసుకువచ్చాడు. మరీ దారుణంగా ట్రాలీ లోడ్ మామిడి పండ్లను 500 రూపాయలకు అడిగారు అక్కడి బేరగాళ్లు. దీంతో ఆ రైతుకు చిర్రెత్తుకొచ్చింది.
అదే ట్రాలీ ఆటోను మామిడి లోడ్‌లో సహా వరంగల్ లోని అండర్ రైల్వే బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చాడు..ఆ మార్గంలో వెళ్తున్న జనాన్ని పిలిచి.. అందరికీ ఉచితంగా పంపిణీ చేశాడు.. రైతు ఉచితంగా మామిడి కాయలు పంపిణీ చేయడం చూసి స్థానికులు సంచులు నింపుకొని పోయారు.. రైతు కడుపు చల్లగా ఉండాలని ఆశీర్వదించి వెళ్ళిపోయారు.
వ్యాపారులు దళారుల దోపిడి చూసి షాక్ అయిన రైతు 500 రూపాయలతో కనీసం తనకు డీజిల్ ఖర్చు కూడా రాదని దీంతో నలుగురి కడుపు నింపడం కోసం మామిడిపండ్ల ను ఉచితంగా పంపిణీ చేశానని చెప్పుకొచ్చాడు.. మార్కెట్లో జరుగుతున్న ఇలాంటి దోపిడీల అరికట్టి అన్నదాతలను ఆదుకోవాలని దళారీ వ్యవస్థను నిర్మూలించి అన్నదాతకు నష్టం జరగకుండా చూడాలని వేడుకున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..