AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంట వ్యర్ధాలకు నిప్పు.. రైతు కుటుంబం బలి.. ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు..

పంట వ్యర్థాలను కాల్చితే నష్టం... కలియదున్నితే మేలని అధికారులు మొత్తుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోని రైతులు, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొలంలో వరికొయ్యలను తగులబెడుతూ ప్రమాదవశాత్తూ ఆ మండల్లోనే పడి రైతు సజీవ దహనం కాగా.. పొగతో ఊపిరాడక ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన భూపాలపల్లి జిల్లా రేపాకపల్లెలో చోటుచేసుకుంది.

పంట వ్యర్ధాలకు నిప్పు.. రైతు కుటుంబం బలి.. ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు..
farmer couple death
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 24, 2026 | 8:15 AM

Share

నిప్పుతో చెలగాటం ప్రాణ సంకటం అని.. మీడియా, పోలీసులు, ప్రభుత్వం ఎంత చెపుతున్నా కొందరు రైతులు ఆలకించడం లేదు.. వాళ్ళ అమాయకత్వమో- మూర్ఖత్వమో.. ఏమో కానీ.. చివరకు ఊహించని విషాదంగా మారుతుంది.. పంట వ్యర్ధాలకు పెట్టిన నిప్పు ప్రాణాలు మింగేస్తుంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఊహించని మహా విషాదం జరిగింది. వరికొయ్యలకు పెట్టిన మంటల్లో పడి ఓ రైతు సజీవదహనం అయ్యాడు. తన భర్త ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఆ రైతు బార్య కూడా అదే మంటల్లో పడి స్పృహతప్పి పడిపోయింది.. ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వరికొయ్యల మంటలు భార్యాభర్తలను బలితీసుకున్న ఈ ఘటన.. మాటలకు అందని మహా విషాదంగా మిగిలింది.

“పిల్లలందరినీ ఒక ఇంటివాళ్లను చేశాం.. ఇక మా బాధ్యత తీరిపోయింది” అని చెప్పుకునే వయసులో ఆ రైతు దంపతులను ఊహించని మృత్యువు వెంటాడింది.. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లె గ్రామంలో జరిగింది..ఇదే గ్రామానికి చెందిన చాగర్ల చంద్రమౌళి(60), భాగ్య(55) దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. వీటికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును ఉన్నారు., ముగ్గురికీ పెళ్లిళ్లు చేసి బాధ్యత తీరింది అనుకున్నారు.. భార్యభర్తలు పొలం పనులు చేసుకుంటున్నారు. శనివారం పొలంలో వరి కొయ్యకాళ్ళు, వరిగడ్డి తగలబెట్టేందుకు ఇద్దరూ చేనుకు వెళ్లారు. గడ్డికి నిప్పు పెట్టగానే ఒక్కసారిగా గాలికి మంటలు విస్తరించాయి. ఆ మంటలు పక్కనే వున్న పొలంలోకి వ్యాపిస్తున్నాయి.. ఈ క్రమంలో మంటలు ఆర్పేందుకు వెళ్లిన చంద్రమౌళి అదే మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

కళ్లెదుటే తన భర్త మంటల్లో కాలిపోతుంటే భాగ్యమ్మ గుండెలు బాదుకుంది. అతన్ని బయటకు లాగేందుకు వెళ్లి ఆమె కూడా తీవ్రంగా కాలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.. కేకలు విన్న చుట్టుపక్కల రైతులు పరుగున వచ్చి మంటలు ఆర్పి భాగ్యను ఆసుపత్రికి తరలించారు.. కానీ ఫలితం దక్కలేదు..చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూసింది.

వీడియో చూడండి..

“ఆయన చాలా మంచోడు. ఎవరికీ అపకారం తలపెట్టడు. పిల్లలందరినీ సెటిల్ చేసి, ఇక హాయిగా బతుకుదామనుకునే టైంలో ఇలా జరగడం దారుణం” అంటూ గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఒకే ప్రమాదంలో మృతిచెందడాన్ని, పిల్లలు కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.. రైతులు పంట వ్యర్ధాలకు నిప్పు పెట్టవద్దని సూచించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం పరకాల ప్రభుత్వ ఆసుపత్రి నిమిత్తం మార్చురీకి తరలించారు. పంట వ్యర్ధాలకు పెట్టిన నిప్పు ఈ వారం రోజుల వ్యవధిలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో నలుగురిని బలి తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us