
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో దశాబ్ద కాలంపైగా సేవలు అందించిన పోలీస్ జాగిలాలు డానీ (డాబర్మాన్) టైగర్ (జర్మన్ షెపర్డ్) ఘనంగా ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆధ్వర్యంలో అస్త్ర కన్వెన్షన్‌లో వాటికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డానీ (10 సంవత్సరాలు), టైగర్ (11 సంవత్సరాలు) డాగ్ స్క్వాడ్ విభాగానికి విశేష సేవలందించాయి. ముఖ్యంగా దొంగతనాలు, హత్య కేసులలో ట్రాకర్ డాగ్‌లుగా కీలక పాత్ర పోషించి, పోలీసు శాఖకు ఎంతో సహాయపడ్డాయి. 2014లో టైగర్, 2015లో డానీ పోలీసు శాఖలో చేరాయి.
ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ జాగిలాలను పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జాగిలం టైగర్‌కు హ్యాండ్లర్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్ మహేందర్, అలాగే జాగిలం డానీకి హ్యాండ్లర్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్ జి. మురళిలను కూడా శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో జాగిల విభాగం చాలా కీలకమైనదని అన్నారు. నేరస్తులను పట్టుకోవడంతో పాటు, పేలుడు పదార్థాలు, ప్రస్తుతం మత్తు పదార్థాలను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాగిలాలతో ఎన్నో కేసుల్లో నిందితులను పట్టుకున్నామని అన్నారు. వీటి సేవలు మరువలేవని చెప్పారు. శాంతి, భద్రతలను కాపాడటంలోనూ ఇవి కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.