AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ప్రాంగణంలోని కారుపై ఎర్రటి టవల్.. డౌట్ వచ్చి ఏంటని చూడగా..!

హైదరాబాద్ మహానగరం శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మావోయిస్టు బెదిరింపుల కేసు అచ్చం సినిమా తరహాలో ఉంది. డబ్బులకు ఆశపడి ఇంటి యజమానికి బెదిరింపు లేఖ రాశారు. అది కూడా సదాసీదా లేఖ కాదు. మావోయిస్టుల పేరుతో లేఖను రాశారు. మావోయిస్ట్ దళ సభ్యుడు శంకరన్న పేరుతో ఈ లేఖ ను రాశారు.

ఇంటి ప్రాంగణంలోని కారుపై ఎర్రటి టవల్.. డౌట్ వచ్చి ఏంటని చూడగా..!
Fake Maoist Arrest
Vijay Saatha
| Edited By: Balaraju Goud|

Updated on: May 28, 2025 | 5:12 PM

Share

హైదరాబాద్ మహానగరం శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మావోయిస్టు బెదిరింపుల కేసు అచ్చం సినిమా తరహాలో ఉంది. డబ్బులకు ఆశపడి ఇంటి యజమానికి బెదిరింపు లేఖ రాశారు. అది కూడా సదాసీదా లేఖ కాదు. మావోయిస్టుల పేరుతో లేఖను రాశారు. మావోయిస్ట్ దళ సభ్యుడు శంకరన్న పేరుతో ఈ లేఖ ను రాశారు. దీనిపై విచారించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వీరు ఫేక్ మావోయిస్టులుగా తేల్చారు.

ఈ వ్యవహారం కొద్ది రోజుల క్రితం షాపూర్‌లో ఉన్న కూనా రవీందర్ గౌడ్‌కు ఒక బెదిరింపు లేఖ రావడంతో మొదలైంది. ఆ లేఖ మావోయిస్టుల పేరుతో రాసినట్లు ఉంది. దీనిని రవీందర్ గౌడ్ తన ఇంటి ప్రాంగణంలోని కారుపై ఉంచారు. కారుపై ఎర్రటి టవల్‌ను ఉంచి దాని కింద లేఖ పెట్టడం ద్వారా అది నిజమైన మావోయిస్టుల చర్యలా కనిపించేలా చూశారు. ఈ తతంగాన్ని గమనించిన రవీందర్ గౌడ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆ లేఖలో తీవ్రతరమైన బెదిరింపులు ఉన్నాయి. 50 లక్షల రూపాయల డబ్బు ఇవ్వకపోతే, అతని కుమారుడిని చంపేస్తామని, అంతే కాకుండా అతని ఇంటిని కూల్చేస్తామని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, తమ వద్ద బాంబులు ఉన్నాయని, అవి అమర్చి పేలుస్తామని హెచ్చరించారు. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతోపాటు బెదిరింపులకు పాల్పడినందుకు శ్రీకాకుళం నుండి బాంబులు సైతం తీసుకొచ్చామని లేఖలో పేర్కొన్నారు.

నిందితుల బెదిరింపులపై జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు రవీందర్ గౌడ్. ఈ కేసు నమోదు చేసిన తర్వాత, జీడిమెట్ల పోలీసులు ఈ విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో, రవీందర్ గౌడ్ ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వ్యక్తి ఒకరు అనుమానస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. అద్దెకు ఉంటున్న ఎర్రంశెట్టి రాజుతో పాటు అతని మిత్రుడు కందురెళ్ళి రాజు ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇద్దరూ కలిసి ఈ మావోయిస్టు ముసుగులో బెదిరింపులు చేయాలని కుట్ర పన్నినట్లు నిర్ధారణ అయింది. ఈ కుట్ర వెనుక వారి ఉద్దేశ్యం పూర్తిగా ఆర్ధిక లాభం పొందడమే అని పోలీసులు తెలిపారు. వారు భయపెట్టి డబ్బు వసూలు చేయాలన్న ప్రయత్నంతో నకిలీ మావోయిస్టుల్లా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

బెదిరింపులకు మరింత నిజమైన రూపం ఇవ్వాలనే ఉద్దేశంతో, వారు శ్రీకాకుళం జిల్లా నుండి నాటుబాంబులను తెచ్చుకోవడం మరింత దురుద్దేశాన్ని స్పష్టంగా చూపించింది. నాటు బాంబులు అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే దేశీయ తయారీ పేలుడు పదార్థాలు. వీటిని మామూలుగా పంటలకు హాని కలిగించే వన్యప్రాణులను భయపెట్టడానికి వాడతారు. కానీ, వాటిని ఇక్కడ వ్యాపారవేత్తలను బెదిరించేందుకు వాడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు పోలీసులు.

నిందితులు నేటి రోజున రవీందర్ గౌడ్ ఇంటి వద్ద బాంబులను అమర్చే ప్రయత్నం చేస్తుండగా, పోలీసులకు సమాచారం చేరింది. వెంటనే ప్రత్యేక బృందం ఘటనాస్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుండి బాంబులు, బెదిరింపు లేఖలు, మరికొన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు విచారణలో వారు తన తప్పును అంగీకరించినట్లు సమాచారం.

జీడిమెట్ల పోలీసులు ఈ కేసును చాలా తెలివిగానే ఛేదించారు. అసలు మావోయిస్టులతో దీనికి ఎటువంటి సంబంధం లేదని వారు నిరూపించారు. ఇది పూర్తిగా ఆర్ధిక ప్రయోజనాల కోసం వేసిన పథకమని తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అలాగే, వారికి సహకరించిన ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..