‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబాన్ని నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు కాజేసిన నకిలీ బాబా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కష్టాలు తీరుస్తానంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన అతడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

మెదక్, ఆగస్ట్ 3: సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా.. సాంకేతికత ఎంత విస్తరిస్తున్నా.. దొంగ బాబాల మాయమాటలను నమ్మే అమాయకులు ఇంకా ఉండనే ఉన్నారు. తాజాగా మెదక్ జిల్లాలో ఓ నకిలీ బాబా లీలలు కలకలం రేపాయి. కష్టాలు తీరుస్తానంటూ ఒకే కుటుంబానికి వల వేసి, గుప్తనిధుల పేరుతో నమ్మించి, చివరికి నగదు,బంగారంతో ఉడాయించిన కేటుగాడి కథ తూప్రాన్ మండలంలో వెలుగుచూసింది. గ్రామస్తులు దేహశుద్ధి చేయడంతో అసలు రంగు బయటపడింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉత్కంఠ రేగింది. తనను తాను పెద్ద బాబాగా పరిచయం చేసుకుని, మాయమాటలతో అమాయక కుటుంబాన్ని ముంచేసిన ఓ నకిలీ బాబా ఎట్టకేలకు పోలీసుల చిక్కాడు.
తనను పూజిస్తే కష్టాలన్నీ తీరిపోతాయంటూ సదరు కుటుంబానికి వల వేశాడు ఈ కేటుగాడు. అంతేకాదు, ఆ ఇంట్లోని ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటే ఆమె జన్మ సార్థకమవుతుందంటూ నమ్మబలికాడు. బాబా మాయమాటలను నిజమని నమ్మిన ఆ కుటుంబ సభ్యులు అతనితో సన్నిహితంగా మెలిగారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఈ దొంగ బాబా.. మీ ఇంట్లోనే కోట్ల విలువైన గుప్తనిధులు ఉన్నాయంటూ సరికొత్త నాటకానికి తెరలేపాడు. నమ్మకం కుదిరేలా సదరు ఇంట్లోనే రహస్యంగా తవ్వకాలు కూడా జరిపించాడు. తీరా చూస్తే అక్కడ ఎలాంటి నిధులు లభించలేదు. గుప్తనిధులు రాకపోయేసరికి.. దోషాలు ఉన్నాయంటూ, పూజల పేరుతో ఆ కుటుంబం వద్ద ఉన్న భారీ నగదు, బంగారు ఆభరణాలను గుంజేశాడు.
వాటితో నగరంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. రోజులు గడుస్తున్నా నిధులు రాకపోవడం, అటు డబ్బు, బంగారం పోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. విషయం బయటపడుతుందనే భయంతో ఆ నకిలీ బాబా గ్రామం నుంచి రాత్రికి రాత్రే పరారయ్యాడు. కట్ చేస్తే.. ఆదివారం నాడు ఆ నకిలీ బాబా మళ్లీ అదే గ్రామానికి రావడంతో కథ అడ్డం తిరిగింది. నిందితుడిని పసిగట్టిన గ్రామస్తులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. బాధితుల నుంచి అసలు విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. నకిలీ బాబాకు గట్టిగా దేహశుద్ధి చేసి, తూప్రాన్ పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ దొంగ బాబా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు ఎవరెవరిని మోసం చేశాడు? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
