Telangana: కమ్మగా గారెలు వేసుకుని తినాలనుకున్నాడు.. తీరా ఇంటికి వచ్చి చూసేసరికి..
ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం పక్కనే ఉన్న షాప్ నుంచి రెండు నూనె ప్యాకెట్లు కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి.. కమ్మగా గారెలు వేసుకుని తినాలనుకున్నాడు.. తీరా ఇంటికి వచ్చి చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే

నిర్మల్ జిల్లాలో కాలం చెల్లిన బ్రాండెడ్ నూనె ప్యాకట్ల అమ్మకాలు కలకలం రేపుతున్నాయి. ఓ ఏజేన్సీలో నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన వినియోగదారునికి చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల క్రితం నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన వినియోగదారుడు.. తీరా ఇంటికి వెళ్లి చూసేసరికి నూనె ప్యాకెట్ గడువు తీరి కనిపించింది. ఇదేంటని యజమానిని అడిగితే కాలం చెల్లిన నూనె తింటే వచ్చే నష్టమేమి లేదు. కావాలంటే మా ఇంటికి రా.. అదే నూనెతో వంటలు వండి తిని చూపిస్తానంటూ దబాయించాడు. దీంతో షాక్ అవడం వినియోగదారుడి వంతైంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
పల్లెటూరు, పట్నం అనే తేడాల్లేకుండా ఆయిల్ ప్యాకెట్ల వినియోగం, ప్లాస్టిక్ క్యాన్లలో నూనె వినియోగం రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. రీఫైన్డ్ ఆయిల్ ను వాడటానికి ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత చూపుతున్నారు. దీంతో ఇదే అదునుగా భావించిన దుకాణ యజమానులు గడువుతీరిన ఆయిల్ ప్యాకెట్లను సైతం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ వినియోగదారుడు ఓ ఏజెన్సీలో రెండు రోజుల క్రితం ఫ్రీడం బ్రాండ్ ఆయిల్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్ళాక చూస్తే ఆ ఆయిల్ ప్యాకెట్ల గడువు గత మే నెలలోనే తేదీ ముగిసిందని గమనించాడు. తీరా దుకాణ యజమానిని వినియోగదారుడు గట్టిగా నిలదీశాడు. అయితే దుకాణాదారుడు మాత్రం గడువు ముగిసిన నూనె వాడితే వచ్చే నష్టమేమి లేదని.. ప్రాణాలు పోవంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు ఆ దుకాణ యజమాని. దీంతో షాక్ అయిన వినియోగదారుడు ఆ ఘటన ను తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. కాలం చెల్లిన నిత్యావసర సరుకులను అమ్ముతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




