ఆత్మీయ సమ్మేళనాలతో కాక రేపుతోన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన పొంగులేటి.. ఈసారి బీఆర్‌ఎస్ హైకమాండ్‌ను టార్గెట్ చేశారు. మీ గెలుపు కోసం నన్ను ప్రాధేయపడిన సంగతి మర్చిపోయారా..? అంటూ నిప్పులు చెరిగారు. నాకు బీఆర్‌ఎస్ సభ్యత్వం ఉందా అని అడుగుతున్నారు.. ఉందోలేదో బీఆర్‌ఎస్సే చెప్పాలన్నారు పొంగులేటి. తన అనుచరులు కొందరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. తనను కొద్దిరోజుల క్రితం వరకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. తనకు పార్టీ సభ్యత్వంలేనప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానుల నిర్ణయం మేరకే పార్టీ మార్పు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
కాకుల్లా, గద్దల్లా పొడిచినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నేను ఒక్కడినే అనుకోవడం.. అది మీ అవివేకం అంటూ హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు.. అన్నిటికీ సమాధానం చెబుతానని అన్నారు. నేను పార్టీ మారే విషయంలో మీ అందరికీ ఉత్కంఠ ఉందన్నారు. కొందరు కాంగ్రెస్ అని.. అమిత్ షాను కలుస్తున్నాని.. షర్మిల పార్టీ అని ప్రచారం చేస్తున్నారని.. ఇందంతా నా అనుచరులు, అభిమానుల నిర్ణయం మేరకు తాను పార్టీ మారడం ఉంటుందని స్పష్టం చేశారు. నా ప్రజలు, అభిమానులు నిర్ణయించిన, నాకు నచ్చిన రోజు మంచి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరో రెచ్చగొడితే…ఇబ్బందులు పెడతారనీ.. నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదన్నారు.
కొందరు నేతల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగి మా కార్య కర్తలను ఇబ్బందులు పెడితే.. అధికారం ఎవడి అబ్బ సొత్తు కాదంటూ అధికారులను హెచ్చరించారు. భవిష్యత్‌లో వడ్డీ కాదు చక్రవడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. మా నేతల్ని బెదిరిస్తున్నారు.. అది మంచి పద్దతి కాదన్నారు. అశ్వా రావు పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆది నారాయణ ఉంటారు.. నేను ఏ పార్టీలోకి వెళ్ళినా నా అభ్యర్థులే నిలబడతారు. నాకు అంత దైర్యం ఉంది.. దమ్ము ఉంది కాబట్టి అభ్యర్థులను ప్రకటిస్తున్నాను. మీ పార్టీ లో మీ స్థానం ఏంటో చూసుకోండి అంటూ పరోక్షంగా పార్టీ అధినాయకత్వాన్ని హెచ్చరించారు.
దీంతో పొంగులేటి తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ విసిరారు. మొత్తానికి పొంగులేటి అనుచరగణంపై బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు అర్థమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం