Telangana Politics: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో తదుపరి ఆ శాఖను ఎవరికి కేటాయిస్తారనే దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తన టీమ్ ఈటల నుంచి తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖను మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డికే మళ్లీ ఆ పదవికి ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు.. మంత్రివర్గంలోనూ సమూల మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమాచారం.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించిన తరువాత.. ఆ పోర్ట్ పోలియోను ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించిందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ప్రతీ రోజూ పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అయితే, సీఎంఒ లోని ఓ సీనియర్ అధికారి ఆరోగ్యశాఖ అధికారులకు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితాలు ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు ఏదైనా ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం కూడా కష్టసాధ్యమవుతోందంటున్నారు.
ఈ నేపథ్యంలో కీలక సమయంలో వైద్య ఆరోగ్యశాఖకు మంత్రి లేకపోవడం అనేది ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఆ శాఖకు మంత్రిని కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఇంతకు ముందు వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సి. లక్ష్మారెడ్డికే మళ్లీ వైద్యఆరోగ్యశాఖను కేటాయించే అవకాశం ఉందని శ్రేణులు భావిస్తున్నాయి. లక్ష్మారెడ్డి.. 2014 నుంచి 2018 మధ్య రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పని చేశారు. 2018లో రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లక్ష్మారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వడంతో.. ఆయనకు అవకాశం లభించలేదు. అయితే, గతానుభవం దృష్ట్యా మళ్లీ లక్ష్మారెడ్డికే మంత్రి పదవి కట్టబెట్టి వైద్య ఆరోగ్యశాఖ కేటాయించే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వైద్యఆరోగ్యశాఖను లక్ష్మారెడ్డికి కేటాయిస్తారా? మరెవరికైనా అప్పగిస్తారా? అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.
Also read:
IPL 2021 Suspended: ఐపీఎల్ పై కరోనా కాటు.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు సందేశం, అజ్ఞాత వ్యక్తి అరెస్టుకు రంగంలోకి దిగిన పోలీసులు