Etela Rajender: ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అలాగే గ్రామాలు బాగుపడితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈటల రాజేందర్ అన్నారు. రాజీనామాలు చేయడం నాకు కొత్తేమి కాదు.. ఎప్పుడు రాజీనామా చేసినా గెలిచాను అని అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీవోలు. తెలంగాణ ఉద్యమానికి ప్రయోజనం కలిగించేలా అనేక సంఘాలు పెట్టామని ఈటల అన్నారు. బెంజ్‌కారులో వెళ్లి రైతు బంధు పథకాలను తీసుకునేవారికి పథకాలు వస్తున్నాయని, నిరుపేదలకు ఎలాంటి పథకాలు రావడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు.
19 ఏళ్ల టీఆర్‌ఎస్ అనుబంధానికి, తెరాస సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నా అని ఈటల అన్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఎన్నిసార్లు బి-ఫారం ఇచ్చినా గెలిచానని అన్నారు. గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీ చేస్తే కేవలం గెలిచింది ఏడుగురే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశానని అన్నారు.
19 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో ఉన్నా.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. కనీసం పది సీట్లు కూడా గెలవలేదని విమర్శించారు. అన్ని అవమానాలు భరించాము. ఇన్ని భరించినా పార్టీలో పేరు లేదు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లో వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు.. తెలంగాణ చిత్రపటంపై గర్వపడేలా గెలిచి వచ్చా.. అని ఈటల అన్నారు.