తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితకు ED నోటీసుల అనంతరం 9 కీలక పరిణామాలు..

ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. వంద శాతం ఇది కక్షసాధింపే అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.  కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు.

తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితకు ED నోటీసుల అనంతరం 9 కీలక పరిణామాలు..
MLC K Kavitha

Updated on: Mar 08, 2023 | 12:22 PM

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. వంద శాతం ఇది కక్షసాధింపే అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.  కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు. అయితే ఆరోపణలను తెలంగాణ బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. చట్టం తనపని తాసు చేసుకుపోతోందన్నది కమలనాథుల వర్షన్. లిక్కర్ స్కామ్‌లో కవితకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. BJP-BRS స్నేహబంధానికి ఇదే నిదర్శనమని విమర్శిసున్నారు హస్తం పార్టీ నేతలు..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్‌ అయ్యారు. కవితకు పిళ్లై బినామీ అని ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపింది. తాను కవిత ప్రతినిధినని పిళ్లై స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు…ఆమె ఆదేశాల మేరకే పిళ్లై పనిచేశాడని ఈడీ రిపోర్ట్‌ చెబుతోంది. లిక్కర్‌ పాలసీలో కీలకంగా వ్యవహరించిన పిళ్లైతో పాటు కవితను ఈడీ ప్రశ్నించే అవకాశం కన్పిస్తోంది. ఈ కేసులో మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టు కాగా.. తదుపరి కవిత కూడా అరెస్టు అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈడీ నోటీసులపై కాసేపట్లో న్యాయ నిపుణులతో కవిత సమావేశం కానున్నారు. ఈడీ నోటీసులపై వారితో చర్చించనున్నారు. మహిళా బిల్లు కోసం ఎల్లుండి ఢిల్లీ దీక్షకు ముందస్తు షెడ్యూల్‌ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో విచారణ వాయిదా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసుల వ్యవహారంలో చోటుచేసుకున్న 9 కీలక పరిణామాలు…

  1.  లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. రేపే విచారణకు రావాలని ఆదేశించింది. భారత జాగృతి ఆధ్వర్యంలో మహిళా బిల్లుపై దీక్షకోసం..ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు కవిత. ఈలోపే నోటీసులు జారీకావడం సంచలనం రేపుతోంది.
  2. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ప్రజావ్యతిరేక, అణచివేత చర్యలకు కవిత తలవంచదన్నారు. బెదిరింపులతో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానన్నారు. రేపటి విచారణకు హాజరయ్యే అంశంపై న్యాయసలహా తీసుకుంటానన్నారు.
  3. కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి. చట్టం తనపని తాను చేసుకుపోతుందంటూనే.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. సర్కారుపై తిట్ల దండకంతో అందుకున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతల పదజాలం అసహ్యంగా ఉందన్నారు.
  4. కవితకు ఈడీ నోటీసులు దుర్మార్గమన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌. బీజేపీ అరాచకాలకు ఇది పరాకాష్ఠ అన్నారు. మోదీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని.. కేసులు, అణచివేతలు కేసీఆర్‌ను ఏమీ చేయలేవన్నారు. బీజేపీ అసలు రూపాన్ని త్వరలోనే ప్రజలముందు పెడతామన్నారు.
  5. ఓ మహిళపై కేంద్రం కక్షసాధిస్తోందన్నారు ఎమ్మెల్యేలు గణేష్‌ గుప్తా, దానం నాగేందర్‌. మహిళా దినోత్సవాన ఇలా నోటీసులివ్వడం సరికాదన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించినందుకే కక్షకట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసినట్లు ఆరోపించారు. కవితపై కక్షసాధింపును ప్రతి మహిళ ఖండించాలని పిలుపునిచ్చారు.
  6. కవితకు నోటీసులివ్వడం తొలిసారేం కాదన్నారు బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. దర్యాప్తులో భాగంగా అనేకమంది పేర్లు వచ్చాయని..కోర్టు పర్యవేక్షణలో కేసు నడుస్తున్నట్లు చెప్పారు. లిక్కర్‌ స్కాం కేసుతో రాజకీయపార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించారు.
  7. లిక్కర్‌స్కాం కేసులో అనేక అనుమానాలున్నాయన్నారు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌గౌడ్‌. రాజకీయ లబ్ధికోసమే అరెస్టులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనన్నారు. బీజేపీ బలోపేతానికే సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటిల రాజకీయాలను ప్రజలు గమనించాలని కోరారు.లిక్కర్‌ స్కాంలో కవిత ప్రమేయంపై ఆధారాలు కూడా దొరికాయని..మరి ఆమెను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మహిళా దినోత్సవం రోజు..మహిళల ఆత్మగౌరవాన్ని కవిత మంటగలిపారన్నారు. బీజేపీ, BRS స్నేహం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
  8. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉండడంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
  9. కవితకు ఈడీ నోటీసులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా దినోత్సవాన రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇదంతా జరుగుతోందని BRS అంటుంటే.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెబుతోంది BJP. మొత్తంగా ఈడీ నోటీసుల వ్యవహారం జాతీయస్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..