Telangana: వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్యం.. తెలంగాణలో లెక్కలు తప్పుతున్న కరోనా కేసులు..

|

Nov 29, 2021 | 8:39 PM

Coronavirus Cases - Mahindra University: తెలంగాణలో కరోనా కేసుల లెక్కల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రైవేటు లాబ్‌లల్లో ఎన్ని టెస్ట్‌లు జరుగుతున్నాయి? ప్రభుత్వ పరిధిలో ఎన్ని జరుగుతున్నాయి..? అనేది లెక్కా

Telangana: వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్యం.. తెలంగాణలో లెక్కలు తప్పుతున్న కరోనా కేసులు..
Coronavirus Cases
Follow us on

Coronavirus Cases – Mahindra University: తెలంగాణలో కరోనా కేసుల లెక్కల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రైవేటు లాబ్‌లల్లో ఎన్ని టెస్ట్‌లు జరుగుతున్నాయి? ప్రభుత్వ పరిధిలో ఎన్ని జరుగుతున్నాయి..? అనేది లెక్కా పత్రం ఉండడం లేదు.. ఇందుకు ఉదాహరణే మేడ్చెల్ జిల్లాలోని మహేంద్ర యూనివర్సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు.. బహదూర్పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా మరోసారి విజృంభించింది. 25మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడటంతో శుక్రవారం నుంచి యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు. వర్సిటీలోని వసతి గృహంలో ఉండే 1392 మంది విద్యార్థులు, ఇతర స్టాఫ్ తో కలిపి సుమారు 18 వందల మందిని ఖాళీ చేయించారు. ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు, యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న దుకాణాల వ్యాపారులకు మేడ్చల్ అధికారులు వర్సిటీ ప్రాంగణంలో పరీక్షలు నిర్వహించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. లోతుగా పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కేసులు ఎప్పుడు మొదలయ్యాయో.. పరిశీలిస్తే కరోనాపై అధికారులు ఎంత సీరియస్‌గా ఉన్నారో తెలుస్తోంది.

నవంబర్ 17 న మహేంద్రాలో మరోసారి కరోనా పడగ విప్పింది. ఐదుగురుకి లక్షణాలు కనిపించడంతో.. కరోనా టెస్ట్‌లు చేయించింది మేనేజ్మెంట్. దీనిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. తరువాత వారికి మైల్డ్ గా సింటమ్స్ ఉండడంతో.. మెడిసన్స్ ఇచ్చి ఇంటికి పంపించారు. తరువాత.. మరికొందరిలో లక్షణాలు కనిపించడంతో 23వ తేదీన 720 మందికి టెస్ట్‌లు చేయించాగా.. ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. తరువాతరోజు అంటే ఈ నెల 24న.. 667మందికి టెస్ట్‌లు చేయగా.. 13 మందికి పాజిటివ్ రావడంతో మేనేజ్మెంట్ ఒక్కసారిగా తలపట్టుకుంది. ఇక 25న మరో 180 మందికి కరోనా టెస్ట్ లు చేస్తే ఐదుగురుకి పాజిటివ్ రాగా, 26 న మిగతా 160 మందికి టెస్ట్ లు చేయగా.. ఎవరికీ పాజిటివ్ రాలేదు. మొత్తంగా 1730 మందికి టెస్ట్‌లు చేయగా.. 30 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే వీరందరికీ కొంపల్లి లోని కనెక్ట్ డయాగ్నస్టిక్ ప్రైవేటు ల్యాబ్‌లో టెస్ట్‌లు చేయించింది మహేంద్రా యూనివర్సిటీ యాజమాన్యం. అంటే.. ఈనెల 17న పాజిటివ్ కేసులు వస్తే.. 26వ తేదీ వరకూ.. సరిగ్గా పదిరోజులకు గానీ పాజిటివ్ కేసులు వచ్చినట్లు జిల్లా వైద్య అధికారులకు తెలియలేదు.

మహేంద్ర మేనేజ్మెంట్ ఏఏ తేదీల్లో ఎన్ని కేసులు వచ్చాయో.. చెబితేనే కానీ అధికారులు తెలియలేదు. అంటే ప్రైవేటు హాస్పిటల్స్, ల్యాబ్స్‌లో జరుగుతున్న టెస్ట్‌లపై వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందడం లేదని తెలుస్తోంది. కనీసం ఏ ల్యాబ్స్‌లో ఎన్ని టెస్ట్‌లు అవుతున్నాయి? ఎంతమందికి కరోనా పాజిటివ్ వస్తుంది.. వంటి సమాచారం తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఈ కేసులోనే కాకుండా.. చాలాసార్లు అధికారులకు ఎవరో చెబితేనే కానీ.. ఎక్కడ కేసులు వచ్చాయో తెలియకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. స్కూల్స్, గురుకులాలు, కాలేజీలు, యూనివర్సిటీలు.. ఇలా విద్యాసంస్థల్లోనే కాకుండా.. ఇతర కంపెనీలలో కూడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే దీనిపై ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు చెబుతున్న సమాధానం డిఫరెంట్‌గా ఉంది. సొంతంగా పరీక్షలు చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదంటూ.. ఉన్నతాధికారులు సమాధానం చెబుతుండటం గమనార్హం.

అయితే ప్రైవేటు ల్యాబ్‌లల్లో నమోదవుతున్న కేసుల గురించి తెలియనప్పుడు.. మీడియా బులిటెన్‌లో అధికారికంగా చూపిస్తోన్న కేసుల సంఖ్యను ఎంతవరకూ ప్రమాణికంగా తీసుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డైలీ రిలీజ్ చేస్తోన్న మీడియా బులిటెన్‌లో కేవలం ప్రభుత్వం టెస్టింగ్ సెంటర్స్‌లో నమోదవుతున్న కేసుల సంఖ్యనే చూపిస్తోన్నారా? లేక వాటిని కూడా ఇంకా తగ్గించి చూపిస్తోన్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే.. ఇప్పటికే కరోనా టెస్ట్‌లు, పాజిటివ్ కేసులు, మరణాల విషయంలో.. ప్రభుత్వంపై ఇప్పటికే అనేకసార్లు విమర్శలు వచ్చిన నేపధ్యంలో.. మరోసారి ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటుండటం పలు విమర్శలకు తావిస్తోంది.

ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతోన్నాయి. ఇలాంటి సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ బి.1.1.259 పై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పోయిందన్నట్లుగా జనంతో పాటు .. అధికారులు కూడా ఏమరపాటుగా ఉంటే కేసులు పెరిగే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఏదేమైనా కరోనా కేసులు తగ్గుతున్నా.. అధికారులు మాత్రం నిరంతరం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే.. థర్డ్‌ వేవ్ రూపంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలెందర్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్

Also Read:

TSRTC MD Sajjanar: రక్తదానం చేయడండి.. బస్‌లో ఫ్రీగా ప్రయాణించండి.. రాష్ట్ర వ్యాప్తంగా రేపు శిబిరాలు..

CM KCR Press Meet: కేంద్రం చేతులెత్తేసింది.. కొనుగోలు కేంద్రాలు ఉండవు.. యాసంగిలో పంటలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..