తెలంగాణ వ్యాప్తంగా హస్తం పార్టీ హవా సాగితే.. దుబ్బాకలో మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ దుమ్మురేపింది. కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై గ్రాండ్ విక్టరీ కొట్టారు. రామలింగారెడ్డి అకాల మరణం కారణంగా వచ్చిన బై ఎలక్షన్స్‌లో విజయం సాధించిన రఘునందన్ ఈసారి ఓటమిని చవి చూశారు. దుబ్బాక ప్రజలు బీఆర్‌ఎస్‌కు పట్టంకట్టారు. ఏకంగా 40 వేలకిపైగా ఓట్ల మెజారిటీతో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఫైట్ నెలకొంటున్న నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెరకు శ్రీనివాస్ రెడ్డిని బరిలో నిలిపింది. దీంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలంరేపింది.
ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో 1,98,100 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తక్కువ ఓటర్లున్న నియోజకవర్గం ఇదే. నవంబరు 30న జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 87.51 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక శాసనసభ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గంలోని ఎక్కువ ప్రాంతాలు సిద్ధిపేట జిల్లాలో విస్తరించి ఉండగా.. మెదక్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దుబ్బాకలోనే చదవుకోవడం విశేషం. 1952 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం మూడుసార్లు రూపాంతరం చెందింది. 2016లో తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు దుబ్బాక నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మిర్దొడ్డి, తోగుట, రాయపోల్ మండలాలు, మెదక్ జిల్లాలోని దౌల్తాబాద్, చేగుంట, నార్సింగి మండలాలు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో మాజీ జర్నలిస్ట్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు. అంతకు ముందు 2004, 2008 ఉప ఎన్నికలోనూ అక్కడి నుంచి ఆయన విజయం సాధించారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో 2020లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు విజయం సాధించారు. ఆ ఉప ఎన్నికలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతా రెడ్డి(బీఆర్ఎస్ అభ్యర్థి) పై రఘునందన్ రావు 1,079 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలను ఇక్కడి ఓటర్లు ఆదరించారు. ఇప్పటి వరకు ఐదుసార్లు కాంగ్రెస్, టీడీపీ నాలుగు, బీఆర్ఎస్ నాలుగు, స్వతంత్రులు రెండుసార్లు, పీడీఎఫ్, బీజేపీ ఒక్కోసారి విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్