సైబర్ కేటుగాళ్ళు ఏ దేశాల నుండి అపరేట్ చేస్తున్నారో తెలుసా..? పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ క్రైమ్ బాధితులతో పాటు సైబర్ క్రైమ్ నేరస్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ క్రైమ్ బాధితులతో పాటు సైబర్ క్రైమ్ నేరస్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను టార్గెట్‌గా చేసుకుని కొంతమంది బడా మాఫియా గాళ్లు విదేశాల నుండి సైబర్ క్రైమ్ నేరాలను ఆపరేట్ చేస్తున్నారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
హైదరాబాద్‌కు చెందిన సలీముద్దీన్ అనే వ్యక్తి తనకు ఏదైనా ఉద్యోగం చూపించాల్సిందిగా తనకు తెలిసిన స్నేహితుడిని కోరాడు. ఆ స్నేహితుడు సల్మాన్ అనే వ్యక్తిని కాంటాక్ట్ అవమని చెప్పాడు. తనకు కొద్ది డబ్బు చెల్లిస్తే పాస్‌పోర్ట్‌తోపాటు విదేశాల్లో ఉద్యోగం చూసి పెడతానని సలీముద్దీన్‌ను నమ్మించాడు సల్మాన్. చెప్పిన విధంగానే డబ్బులు చెల్లించటంతో సల్మాన్ పాస్‌పోర్ట్‌ను అరేంజ్ చేశాడు. హైదరాబాద్ నుండి లావుస్ దేశానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. అక్కడికి వెళ్ళగానే సల్మాన్‌ను కలిశాడు.
అయితే అక్కడ వీరికి ఇచ్చిన ఉద్యోగం చూసి సలీముద్దీన్ అవాక్కయ్యాడు. భారత్‌లో జరుగుతున్న సైబర్ నేరాలకు ఇక్కడికి లింకు ఉన్నట్లు సలిమ్ గుర్తించాడు. తనలాగే ఎంతోమంది అమాయక భారతీయులను ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి ఇక్కడ వారిచేత సైబర్ నేరాలు చేయి స్తున్నారు. సైబర్ నేరాలు చేసేందుకు ఇతర దేశాల నుండి వచ్చే వారికి ఒక టూల్ కిట్ ను ఇస్తారు. ఈ టూల్ కిట్ ద్వారా సైబర్ నేరాలు చేయాలని వీరిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలా సైబర్ నేరాలు చేస్తే వచ్చిన నగదుతో వారికి జీతాలు ఇస్తామని మభ్యపెడుతున్నారు.
ఒకవేళ తమకు ఈ ఉద్యోగం ఇష్టం లేదని తప్పుకోవాలని చూస్తే, వారిని బలవంతంగా హింసించి ఈ సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కొన్నిసార్లు కరెంట్ షాక్ ట్రీట్‌మెంట్ సైతం ఇచ్చారని బాధితుడు సలీముద్దీన్ చెప్పుకొచ్చాడు. తనలాగే హింసకు గురైన మరో బాధితుడిని కలిసిన సలీముద్దీన్ లావుస్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ ద్వారా క్షేమంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యాడు. తాను ఫేస్ చేసిన ఇబ్బందులను సైబర్ పోలీసులకు సలీముద్దీన్ వివరించాడు.
ఇటీవలే కాంబోడియా దేశంలో ఇదే తరహాలో సైబర్ క్రైమ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లు గతంలోనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు అదే రీతిలో లావుస్ దేశంలో సైబర్ నేరస్తుల సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వాటికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులకు వివరించాడు. దీంతో లావుస్ మాయగాళ్ల గుట్టురట్టు చేసేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..