తెలుగు ఆణిముత్యం కళాతపస్వి.. నేడు 90వ పుట్టిన రోజు
సినిమా ఆయన శ్వాస. సినిమా ఆయన ధ్యాస. మరో అంశం గుర్తుకు రాదాయనకు. తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు మర్చిపోని.. మర్చిపోలేని దర్శకుడు. తెలుగు తెరకు మంచి సినిమా తీయాలన్నదే ఆయన తపన. తెలుగు వారి సాంప్రదాయ కళా రూపాలను అవపోసన పట్టిన నిజమైన కళా తపస్వి. కొడిగట్టి పోతున్న శాస్త్రీయ సాంప్రదాయాన్ని కొమ్ముకాచి తరువాతి తరానికి అందించాలన్న తపన ఉన్న నిజమైన తెలుగు ముద్దు బిడ్డ కే.విశ్వనాద్. సంప్రదాయ కళాచిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్స్‌కు […]
సినిమా ఆయన శ్వాస. సినిమా ఆయన ధ్యాస. మరో అంశం గుర్తుకు రాదాయనకు. తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు మర్చిపోని.. మర్చిపోలేని దర్శకుడు. తెలుగు తెరకు మంచి సినిమా తీయాలన్నదే ఆయన తపన. తెలుగు వారి సాంప్రదాయ కళా రూపాలను అవపోసన పట్టిన నిజమైన కళా తపస్వి. కొడిగట్టి పోతున్న శాస్త్రీయ సాంప్రదాయాన్ని కొమ్ముకాచి తరువాతి తరానికి అందించాలన్న తపన ఉన్న నిజమైన తెలుగు ముద్దు బిడ్డ కే.విశ్వనాద్. సంప్రదాయ కళాచిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్స్‌కు ఆయన నిలువెత్తు దర్పణం.. అంతరించి పోతున్న సాంప్రదాయ కళల సంరక్షణ బాధ్యతను తన భుజ స్కందాలపై మోసిన నిజమైన కళాతపస్వి అని అంటే తప్పుకాదు.
పువ్వు పుట్టగానే… తెలుగు సాంప్రదాయ చిత్రాలకు వన్నెలద్దిన విలక్షణ దర్శకుడు విశ్వనాద్. 1930 పిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రమణ్యం, సరస్వతి గార్లకు జన్మించాడు విశ్వనాథ్. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెద పులివర్రు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ చదువులు గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగాయి. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అన్నట్లుగా బాల్యం నుంచే సంగీత సాహిత్యం, వేదం, సాహిత్యం రంగాలలో ఆసక్తిని కనబరచడం ఆశ్చర్యాన్ని కలిగించింది. భక్తి ప్రవపత్తులతో వేకువజామునే ఆ శివుని పూజించేవారు. నటరాజ అంశని కలిగిన విశ్వనాధుడు నృత్యం, సంగీతం పై ఆధారపడి మనుగడ సాగించిన వారి జీవితాలను విశ్వనాధ్ ను తీవ్రంగా కలవర పరిచింది. జయలక్ష్మిని అర్దాంగిగా చేపట్టిన కాశీ విశ్వనాధుడు అనతికాలంలోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారిపేర్లు పద్మావతి, నాగేంద్రనాద్, రవీంద్రనాథ్‌లు కాగా ప్రస్తుతం ఆరుగురు మనవలు ఉన్నారు.
అలా మొదలైంది… చెన్నై లో స్టూడియో సౌండ్ రికార్డిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు విశ్వనాథ్. బాల్యం నుంచే చిత్ర దర్శకుడు కావాలన్నా తపన మనసులో చాలా దృడంగా ఉంంది. అందుకే ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశాన్ని విశ్వనాద్ వదులుకోలేదు. ఇంతింతై వటుడింతై ఎదిగినట్టుగా బాల చందర్, బాపుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసాడు. ఆ అనుభవం దర్శకుడిగా పని చేసే అవకాశానిచ్చింది. ఏమాత్రం భయపడకుండా ఏఎన్ఆర్ నటించిన ఆత్మగౌరవం చిత్రం ద్వారా తెలుగు సినిమాకు దిశా నిర్దేశం చేయడం సినీ ప్రముఖులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకోడంతో విశ్వనాద్ లక్ష్యం ఏమిటో చెప్పకనే చెప్పాడు.
విశ్వనాథ్ జీవితం పూర్తి కళాత్మకం మంచి విజువలైజేషన్ ఉన్నా.. ఆ పాత్రనుండి ఏమి కావాలో అది రాబట్టడంలో మాస్టర్ అని చెప్పాలి. పాత్రల ఎంపికలో కథ, స్క్రీన్ ప్లేను నడిపించడంలో విశ్వనాథ్‌ది ప్రత్యేకమైన శైలి అనే చెప్పాలి. మరెవ్వరిని అనుకరించని ఒరవడి విశ్వనాథ్ సొంతమంటే అతిశయోక్తి లేదు. కుటుంబ కథా చిత్రాలు, ముఖ్యంగా స్త్రీ పాత్రలు, ఇతివృత్తంగా ప్రత్యేకంగా నిర్మించిన చిత్రాలు చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి, వంటి చిత్రాలు ప్రజలను ఆలోచింపచేశాయి. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం ప్రతిస్పందన కోసం అన్నా సత్యాన్ని అక్షరాల ఆచరించి తన చిత్రాల ద్వారా ప్రజా స్పందనను రాబట్ట గలిగిన రియలిస్టిక్ డైరెక్టర్ విశ్వనాథ్ అనకతప్పదు. దేశం వేరు.. సమాజం వేరు.. కళలు వేరు.. నృత్యం, సంగీతం వేరు, కాదు అవి మన సంస్కృతిలో భాగం మనతో పాటే సహజీవనం సాగిస్తున్నాయి. అయినా అవంటే మాకు విసుగు. శాస్త్రీయ సాంప్రదయాన్ని కించపరచడం ఒక హాబీగా మారింది. ఈ అంశం మనస్సులో నాటుకు పోయిన విశ్వనాద్ మనస్సులో సంఘర్షణ మొదలైది. ప్రతి రూపంగా అద్భుత సంగీత కావ్యానికి అంకురార్పణ జరిగింది. పూర్ణోదయా మూవీ క్రియేషన్ పై కొత్త నటీ నటులతో నిర్మించిన చిత్రం శంకారాభరణం. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వనాథ్ అంతగా ఆ సినిమాను చెక్కారు.
శంకరాభరణం ఒక చరిత్ర
సినీ జగత్తులో ‘శంకరా భరణం’ ఒక చరిత్ర. ఆ సినిమా ఇప్పుడు కొత్త రూపంలోను వచ్చింది. తెలుగు సినీ జగత్తులో ఎన్నదగిన చిత్రాలలో ఇది ఒకటి. శంకరాభరణం ఒక సంచలనం. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం ద్వారా కొత్త ఊపిరులూదింది. ఈ చిత్రం ఇక్కడే కాకుండా ప్రపంచంలోని శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందిందిదోహదపడింది. ‘కావ్యాలూ, ఇతిహాసాలూ ఎన్నేళ్ళయినా నిత్యనూతనం. వెండితెర కావ్యం ‘శంకరాభరణం’ సరిగ్గా అలాంటిదే.’అందుకే, దొరకునా… ఇటువంటి…సినిమా అంటూ పాడుకుంటున్నారు ప్రేక్షకులు. సినిమాలన్నిటినీ భిన్నంగా నిర్మించిన చిత్రం తీసుకునేందుకు డిస్టిబ్యూటర్స్ ముందుకు రాలేదు. అయినా కొన్ని థియేటర్స్ లో విడుదల చేసారు. చిత్రం ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించింది. నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. మాములు నటుడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. సంగీత పరంగా ప్రజలలో ఆసక్తి కలిగించిన చిత్రం శంకరాభరణం అంటే ఆతిశయోక్తి కాదు. పామరుని దగ్గరనుండి సంగీత విధ్వాంశులు దాకా శభాష్ అనిపిచ్చుకున్న ఏకైక తెలుగు సంగీత చిత్రం. శంకరా నాద శరీరాపరా వేద విహారహరా జీవేశ్వరా పాట అమృతం…ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ పాట ప్రాణం. అలానే మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలూ, ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలూ, దొరకునా ఇటువంటి సేవ దొరకునా… అంటూ వచ్చిన ఈ చిత్ర రాజం 1979లో విడుదలై ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది.
ఎన్నో ఆణిముత్యాలు.. పెళ్ళికి ఏడు అడుగులు అవసరం. దేశానికీ స్వాతంత్రం వచ్చినా ఇంకా పట్టి పీడిస్తున్న కులతత్వం పై విశ్వనాద్ ఎక్కుపెట్టిన పాశుపతాస్త్రం సప్తపది. దేశం ఎలా ఉన్నా మన వృతిని, ప్రవృతిని మర్చిపోతే పుట్టగతులు ఉండవు. స్వయంకృషితో ఎదిగితే మన గౌరవం వృత్తి గౌరవం ఉంటుందన్న సూక్ష్మాన్ని గ్రహించమంటూ సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేసారు. సమాజం తీవ్రంగా ఎదుర్కుంటున్న వరకట్న సమస్యను శుభలేఖ చిత్రం ద్వారా సున్నితమైన హాస్యాన్ని రంగరించిన చిత్రం. ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూత్ర ధారులు చిత్రం ద్వారా వృత్తి పరమైన కళాకారులు జీవితాన్ని కళ్ళకు గట్టినట్లుగ్గా తెరకెక్కించిన తీరు అద్భుతం. చిత్రం, చిత్రాలలోని ప్రతి కోణం చదువుకోవాలన్న సంకల్పం ఉంటే ఎవరైనా రాణిస్తారు అనడానికి ఈచిత్రం సజీవ సాక్ష్యం. నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు విశ్వానాద్ ఆణిముత్యం కాదు కాదు స్వాతిముత్యం. మధ్యతరగతి కుటుంబాలలో వచ్చే సమస్యలను జాగ్రత్తగా పరిశీలించాడు విశ్వనాథ్. మోడువారి పోతున్న జీవితాలను ఎవరో ఒకరు అర్ధం చేసుకోవాలంటాడు. వారిని చేరదీసే మనసు ఉంటే కల్మషం స్వార్ధం లేని వ్యక్తులు ఉంటే ఆ జీవితం నందనవనంగా చేసుకోవచ్చనంటారు విశ్వనాథ్.. సాగర సంగమం, సిరివెన్నెల, శ్రుతిలయ, స్వర్ణకమలం, స్వాతికిరణం ఇలా ప్రతిచిత్రంలో కొత్తదనం… సమస్య, సమాధానం చూపించి తనదైన ముద్రను వేసుకున్న సంప్రాదాయాన్ని చెప్పడం కాదు నిజ జీవితంలో ఆచరించినా సంప్రదాయ వాది విశ్వనాద్. తెలుగు తెరకు మాత్రమే పరిమితం కానీ ఆయన హిందీలో తీసిన సర్గం, కామ్ చోర్, సంజోగ్, జాగ్ ఉత్త ఇన్సాన్, ఈశ్వర్, సర్ సంగం, శుభ్ కామ్నా వంటి చిత్రాలు పూర్తిగా విజయవంతమయ్యాయి. విశ్వనాథ్ కృషికి గుర్తింపుతో పాటు ఐదు జాతీయ అవార్డులు, పది ఫిలిం ఫేర్ అవార్డులు, సొంతం చేసుకున్నాడు కాశీ విశ్వనాథ్. కమర్షియల్ చిత్రాల హోరులో కొట్టుకు పోతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త వొరవడి అందించిన దర్శకుడు విశ్వనాథ్.
1979లో ఆయన అందించిన అద్భుత సంగీతకావ్యం శంకారభరణం, సాగర సంగమం సిఎన్ ఎన్- ఐబి ఎన్ నిర్మించిన వంద చిత్రాలలో ఈ చిత్రాలకు చోటు దక్కడం మనకు గర్వకారణం. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ప్రేక్షకుల హృదయాలలో నిలిచి ఉంటాడన్నది నిజం. మళ్లీ సంప్రదాయ చిత్రాలను తెరకెక్కించే సాహసం చేయగల ఈతరంలో దర్శకులు లేరనే చెప్పాలి.
మిస్సమ్మ.. హాస్యం, సందేశం కలగలసిన చిత్రం. ఓ పక్క కడుపుబ్బ నవ్విస్తూనే మరోపక్క సమాజంలోని వాస్తవ పరిస్థితిని మన కళ్ల ముందుంచింది. రేలంగి చతురత, అక్కినేని నటన, రమణారెడ్డి నాటకీయ పాత్రలు నూరు శాతం హాస్యాన్ని పండించాయి. సమాజంలోని నిరుద్యోగ దుస్థితి, కులాల అంతరాలు అప్పటి పరిస్థితులకు అద్దం పట్టాయి. ఎన్టీఆర్, ఎన్నార్ వంటి అతిపెద్ద హీరోల అపురూప కలయికతో తీసిన చిత్రం ఇది. ఇక మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఎప్పుడూ నటించరు. పాత్రలో జీవిస్తారు. ఇన్ని కోణాలున్న ‘మిస్సమ్మ’ చిత్రం. వరలక్ష్మీ వ్రతం నాడు షూటింగ్‌కు గంట లేటుగా రావడంతోనే భానుమతిని తప్పించి.. మిస్సమ్మ పాత్రకు సావిత్రిని పెట్టారనే చర్చ సాగింది. విషయం ఏదైనా మిస్సమ్మ చిత్రం అజరామరం. తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా. అలాంటి కుటుంబ కథా చిత్రాల కాలం మళ్లీ తిరిగి వస్తుందంటున్నారు సినీ అభిమానులు.
అవార్డులెన్నో.. ఆయనకు ఎన్నో అవార్డులు. మరెన్నో రివార్డులు వరించాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కాయి. 1980లో జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రంగా శంకరాభరణం. 1982లో నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రంగా సప్తపది. 1984లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా సాగరసంగమం, 1986లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా స్వాతిముత్యం. 1988లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగు శృతిలయలు. 2004లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా స్వరాభిషేకం సినిమాలు ఎంపికయ్యాయి. అంతే కాదు.. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 1992లో పద్మశ్రీ పురస్కారం, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు కళాతపస్వి విశ్వనాధ్. సినీ జగత్తులో ఎన్నో ఆణిముత్యాలను తీసిన కళాతపస్వి విశ్వనాథ్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.
కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9.