AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌..

రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టమని, వారు ఎదుర్కుంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. థేమ్స్ నది మాదిరిగా మూసీ నాదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని...

Telangana: రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌..
Telangana
Sravan Kumar B
| Edited By: Narender Vaitla|

Updated on: Jan 22, 2024 | 8:22 PM

Share

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఈ బృందం ఉప ముఖ్యమంత్రికి అందచేసింది.

రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టమని, వారు ఎదుర్కుంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. థేమ్స్ నది మాదిరిగా మూసీ నాదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, దీనితో పాటు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మూసీ నది శుద్దితో సుందరీకరణ జరిగి, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, మరిన్ని ఫుడ్ కోర్టులు,ఎంటర్టైన్ మెంట్ ఈవెంట్లు జరిగే అవకాశం ఉందని తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తి గా మారుతుందని తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ధరణిపై తగు సూచనలు, సలహాలను అందచేస్తే తాను పరిశీలించడంతో పాటు ధరణి పై ఏర్పాటు చేసిన కమిటీ కి అందిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. డబ్బులు కట్టి గత రెండు మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరకాస్తులను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి పలు సూచనలను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రికి అందచేసింది. భవన నిర్మాణ రంగ అభివృద్ధికి ‘రేరా’ ఏర్పాటయినందున , భవన నిర్మాణ అనుమతులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం మార్టగేజ్ విధానాన్ని ఎత్తి వేయాలని, రాష్ట్రంలో అధికంగా ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని, జీ.ఓ. 50 ను ఎత్తివేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న లక్షలాది ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, తద్వారా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.

టీ.ఎస్.బీ పాస్ క్రింద వివిధ ప్రాజెక్టులపై సమర్పించిన ధరకాస్తులు రంగారెడ్డి జిల్లాలో గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని, దీనివల్ల ఎన్నో ప్రాజెక్టులు నిలిచి పోయాయన్నారు. రాష్ట్రంలో గత ఆరు నెలలనుండి ఎన్విరాన్ మెంట్ కమిటీ లేదని, వెంటనే ఆ కమిటీని వేయాలని కోరారు. భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విధ్యుత్ కనెక్షన్లకు యూనిట్ కు రూ.9 నుండి 14 రూపాయలకు పెంచారని దీనిని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన వారిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధులు మేకా విజయ సాయి,కె. శ్రీధర్ రెడ్డి, కాళీ ప్రసాద్, దశరథ్ రెడ్డి, చలపతి రావు, భూపాల్ రెడ్డి, మారోజు శ్రీధర్ రావు, అశోక్, రామి రెడ్డి వెంకట్ రెడ్డి, కె.కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..