తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ ఫీవర్ కేసులు భారీగా పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు 9,298 డెంగ్యూ కేసులు నమోదు అయినట్టుగా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే 4,245 కేసులు నమోదయ్యాయి. కాగా, డెంగీ కేసుల సంఖ్య 2019లో గరిష్ట స్థాయి 13,337 కేసులు నమోదయ్యాయి. వరంగల్, కరీంనగర్ జిల్లా అధికారుల లెక్కల ప్రకారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలో ఇప్పటివరకు 8 మరణాలు నమోదు కాగా, రంగారెడ్డిలో 897 కేసులు నమోదయ్యాయి. ఈసారి పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని అధికారులు వెల్లడించారు.
ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ, గత నెలలో 180 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అయితే ఈ నెలలో కేసుల సంఖ్య 250 కి పెరిగిందని చెప్పారు. కనీసం 150 మందికి పైగా వైరల్ ఫీవర్ నమోదైంది. అధిక ఫీవర్, ఒళ్లు నొప్పులు, వాంతులు సహా సాధారణ లక్షణాలతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు ఫీవర్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారని చెప్పారు. ఇన్ పేషెంట్లు కూడా ఎక్కువగానే ఉన్నారు, వారిలో ఎవరూ సీరియస్‌గా లేరు. కొద్ది రోజుల్లోనే వారంతా పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. కానీ, హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ప్లేట్‌లెట్ల సంఖ్య 20,000 కంటే ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇకపోతే, నగరంలో డెంగీ మరణాలు లేవని చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధిని నియంత్రించడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ వ్యాధిని అరికట్టడంలో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు దాదాపు 1,600 మంది ఎంటమాలజీ నిపుణులను రంగంలోకి దించారు. ఇకపోతే, డెంగీ రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతతో ఈ వ్యాధిని అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడ కూడా నీరు ఎక్కువ రోజులు నిల్వ లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. పరిసరాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి