AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు.. భారీ లాభాల పేరుతో గాలం.. చివరకు రూ.2.31 కోట్లు లూటీ!

హైదరాబాద్‌లో ఒక డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపులో చేర్చి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.2.31 కోట్లు మోసం చేశారు. భారీ లాభాల ఆశచూపి నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా నిధులను కాజేశారు. వర్చువల్ లాభాలు చూపించి, విత్‌డ్రా సాధ్యం కాకపోవడంతో మోసం బయటపడింది. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Hyderabad: వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు.. భారీ లాభాల పేరుతో గాలం.. చివరకు రూ.2.31 కోట్లు లూటీ!
Hyderabad Cyber Crime
Balaraju Goud
|

Updated on: Aug 28, 2026 | 10:28 AM

Share

హైదరాబాద్: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందవచ్చంటూ సైబర్ నేరగాళ్లు ఓ వైద్యుడిని నమ్మించి ఏకంగా రూ.2.31 కోట్లు కాజేసిన ఘటన సైబరాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ పీరం చెరువు ప్రాంతానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఈ సైబర్ మోసానికి బాధితుడయ్యారు. ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ శ్రీనివాస్‌ను సైబర్ నేరగాళ్లు ముందుగా మోసపూరిత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఆ గ్రూపులో స్టాక్ మార్కెట్‌పై మంచి అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన విశ్లేషకులు ఉన్నారని ఆయనను నమ్మించారు. వారి సూచనలు, సలహాల ప్రకారం పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీగా లాభాలు పొందవచ్చని నిందితులు నమ్మబలికారు.

అనంతరం ట్రేడింగ్ కోసం ప్రత్యేకమైన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని డాక్టర్‌కు సూచించారు. సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న బాధితుడు.. విడతల వారీగా అందులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో మొత్తం రూ.2.31 కోట్లను నిందితులు సూచించిన ఖాతాల్లో పెట్టుబడిగా జమ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. బాధితుడి నమ్మకాన్ని మరింత పెంచేందుకు సైబర్ నేరగాళ్లు ఆ యాప్‌లో భారీగా వర్చువల్ లాభాలు వచ్చినట్లు చూపించారు. దీంతో డాక్టర్ శ్రీనివాస్ తన పెట్టుబడులపై గణనీయమైన లాభాలు వచ్చాయని భావించారు. అయితే ఆ మొత్తాన్ని తిరిగి విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చింది.

తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన డాక్టర్ శ్రీనివాస్ వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, వాట్సాప్ గ్రూపులు, యాప్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని చెప్పే గుర్తుతెలియని వ్యక్తులు, వాట్సాప్ గ్రూపులు, అనధికారిక ట్రేడింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ, యాప్, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us