రంగారెడ్డి జిల్లా, ఆగస్టు 6: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి షాద్ నగర్ పట్టణంలో జీరో చిట్టీల వ్యాపారం బారినపడి పడ్డారు అమాయకులు. రిజిస్టర్ చిట్టీలు వేయకుండా జీరో చిట్టీలు వేసి చివరకు మోసాలకు గురయ్యారు.. షాద్ నగర్‌లో జీరో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ మహిళ గత మూడు రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆమె ఇంటి చుట్టూ బాధితులు డబ్బుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు చీటీ డబ్బుల కోసం వెంపర్లాడుతున్నారు. ఈ విషయం బయటికి తెలియడంతో బాధితుల సంఖ్య పెరిగింది. దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్టు సమాచారం. లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు వివిధ పద్ధతుల్లో చిట్టీలు వేస్తున్నట్టు బాధితులు పేర్కొంటున్నారు. వసంత అనే మహిళ ఈ మోసం చేసినట్లుగా బాధితులు చెబతున్నారు.
ప్రస్తుతం 7, 8 కోట్ల రూపాయల చిట్టీలు బకాయి ఉండడంతో ఏం జరిగిందో తెలియదు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుందనీ, డబ్బులు బకాయిలు కట్టాల్సిన వారికి సమాధానం రాకపోవడంతో మోసం జరిగిందని భావిస్తున్నారు. ఇంటి వద్ద తాళం దర్శనం ఇవ్వడంతో తమ డబ్బులు పోయినట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ భర్త ఆర్టిసి డిపోలో పని చేస్తున్నట్టు చెబుతున్నారు. బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బాధితుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే 2 కోట్ల రూపాయల వరకు మోసం చేసి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.. నిందితురాలు వసంతను, ఆమె భర్తను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
చిరువ్యాపారులు, ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీ డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అంటున్నారు.. ఏలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ చిట్టీలు చేయటం, ప్రైవేటు ఫైనాన్స్ చేయడం ఆర్థిక, క్రిమినల్ నేరాల కింద పరిగణించబడుతుంది. అలాగే అధిక వడ్డీలు కట్టలేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారని వారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా పోలీస్ శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు, అధిక వడ్డీ వ్యాపారాలు, బెట్టింగ్, అక్రమ ఫైనాన్స్ చేసే వ్యాపారులపై నజర్ వెయ్యాలి. వడ్డీ వ్యాపారులు ఎవరైనా బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని వడ్డీ గురించి వేధించినా, అధిక వసూలకు యత్నించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాల్లో హెచ్చరించారు. రిజిస్టర్ చిట్టీలు కాకుండా జీరో చిట్టీ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి వ్యాపారుల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతాయని వారిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు.