తెలంగాణలోని నల్గొండ జిల్లాలో సాగర్ కాలువ (sagar Canal) లో వరస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాల్వలో కారు కొట్టుకుపోయిన ఘటన మరవక ముందే మరో ప్రమాదం జరిగింది. హాలియా వద్ద ఉన్న సాగర్ కాలువలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. తాడు సహాయంతో కాల్వలో దూకిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో యువతిని కాపాడగా.. నీటి ప్రవాహ ఉద్ధృతికి యువకుడు కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందు కోసం గజ ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. కాల్వలో దూకిన ప్రేమజంట పీఏ పల్లి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలో జరుగుతున్న ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
గతంలో జరిగిన ఘటనలో వేములపల్లి వద్ద సాగర్ కాలువలో (Sagar Canal) కారు కొట్టుకొచ్చిన ఘటనను పోలీసులు(Police) ఛేదించారు. అక్కా తమ్ముళ్లే కారును కాల్వలో తోసేశారని పోలీసులు నిర్ధరించారు. మతిస్థిమితం సరిగా లేని కారణంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు.. రామాంజనేయులుకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. తండ్రితో విభేదాల కారణంగా కుమారుడు మల్లికార్జున్, కూతురు విఘ్నేశ్వరి దూరంగా ఉంటున్నారు. తమను తండ్రి ఆదరించడం లేదంటూ వారు పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేశారు. ఈ క్రమంలోనే మిర్యాలగూడలోని ఓ థియేటర్ వద్ద పార్క్ చేసిన కారు కనిపించకుండా పోయిందని రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కోపంతోనే కూతురు విఘ్నేశ్వరి, కుమారుడు మల్లికార్జున్ ఈ కారును దొంగిలించారని వాపోయారు.
ఇవీచదవండి.
Siddipet: సిద్ధిపేట సిగలో సరికొత్త మణిహారం.. కనువిందు చేస్తోన్న రూబీ నెక్లెస్ రోడ్ అందాలు..
Market News: ఊగిసలాటలో సూచీలు.. స్వల్ప లాభాలతో ఆరంభం.. ఫోకస్ లో ఉన్న ఆ షేర్లు..