మేడారం మహాజాతర ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా మేడారం జాతర చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదయింది. జాతరకు నెల రోజులు ముందు, జాతర సమయంలో నాలుగు రోజులు కలుపుకుని సుమారు రెండుకోట్ల మంది భక్తులు వన దేవతలు సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించు కున్నారు. మొక్కలు చెల్లించుకోవడంతో పాటు భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలు కూడా దండిగా నిండిపోయాయి.
ములుగు జిల్లాలోని తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర ముగిసేవరకు 512 హుండీలు పూర్తిగా నిండుకున్నాయి. నిండిన ఆ హుండీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపం స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు అధికారులు. హుండీ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఫిబ్రవరి 29వ తేదీ నుండి హుండీల లెక్కింపు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, మేడారం పూజరుల సమక్షంలో హుండీల లెక్కింపు నిర్వహించనున్నారు దేవాదాయ శాఖ అధికారులు.
2022 జాతరలో 497 హుండీలు ఏర్పాటు చేయగా, 11 కోట్ల 44 లక్షలు 12 వేల 707 రూపాయల ఆదాయం లభించింది. 631 గ్రాములు బంగారం, 48 కిలోల వెండి కానుకలు లభ్యమయ్యాయి. ఈసారి భక్తుల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరగడంతో పాటు హుండీలు కూడా పెరిగాయి. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్ని హుండీలు నిండిపోయాయి. తిరుగువారం జాతర వరకు మరో 25 హుండీలు నిండే అవకాశం ఉంది. నిండిన హుండీలను చూస్తే ఖచ్చితంగా ఈసారి ఆదాయం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే హుండీ ఆదాయాన్ని 1/3 గా దేవాదాయశాఖ – పూజారులకు విభజిస్తారు..
హుండీ ఆదాయంలో 33 శాతం పూజారులకు, 67 శాతం దేవాదాయ శాఖకు చెందుతుంది. 13 మంది పూజారులు 33 శాతం వాటాను పంచుకోనున్నారు. ఈ సారీ జాతర ముందు నుంచే తల్లులను దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు. మేడారం మహా జాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మొత్తం రెండు కోట్లకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా వేశారు ఆఫీసర్లు. లక్షలాది మంది భక్తులు జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. మహా వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అటు ప్రభుత్వం కూడా ఈసారి జాతరను ఘనంగా నిర్వహించింది. లోటు లేకుండా నిధులను కేటాయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి సీతక్క దగ్గరుండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…