Covid-19 Third Wave: తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు

| Edited By: Janardhan Veluru

Jul 17, 2021 | 2:22 PM

Telangana Covid-19 Third Wave: కరోనా మహమ్మారి ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం ఇప్పుడిప్పుడే కేసులు

Covid-19 Third Wave: తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
Telangana Corona
Follow us on

Telangana Covid-19 Third Wave: కరోనా మహమ్మారి ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. ప్రస్తుతం కేసులు తగ్గినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుదల కనిపిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే అప్రమత్తం కాకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే.. రూరల్ ప్రాంతాల్లో చాలాచోట్ల కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. గత నాలుగు రోజుల నుంచి కేసుల పెరుగుదల కనిపిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. గురువారం 710 కేసులు నమోదు కాగా.. శుక్రవారం 716 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కరోనాతోపాటు డెంగ్యూ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిసరాల్లో పెరుగుతున్న కేసులపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. దీంతోపాటు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా.. ఆయా జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖకు సూచనలు చేసినట్లు పేర్కొంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతానికి కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దంటూ సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరిస్తున్నారు.

కాగా.. రాష్ట్రంలో నిన్న కొత్తగా 715 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,35,320 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,751 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీ-76, కరీంనగర్‌ – 52, ఖమ్మం-68, మంచిర్యాల – 45, నల్గొండ -54, వరంగల్‌ అర్బన్‌-49 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Also Read:

Tecno Camon Phones: కొత్తగా రెండు ఫోన్‌లను లాంచ్‌ చేసిన టెక్నో.. ప్రారంభ ధర రూ. 12,999.. డిస్కౌంట్‌ కూడా.