దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 29గా ఉండగా.. ఈరోజు కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు బులిటెన్లో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1322 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే.. హైదరాబాద్‌లో తొమ్మిది మందికి వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు బులిటెన్లో పొందుపరిచారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఐసోలేషన్ వార్డులతో పాటూ అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలోని మెడికల్ ల్యాబ్‌లో ఒక్క రోజులో 16,500 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే సామర్థ్యం ఉన్నట్లు వాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. వీటితో పాటూ ప్రైవేట్ పరిధిలోని 84 టెస్టింగ్ ల్యాబ్‌లను కరోనా పరీక్షలు చేసేందుకు అనుకూలంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల లోపే కోవిడ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.
కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. పదేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబడ్డ వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలని ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉంచినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉందని అధికారికంగా తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..