ఆ నేతకు రాష్ట్రంలోనే అందరికంటే ముందే టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. కోస్గి బహిరంగ సభా వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో యువ నేతలో ఉత్సాహం పెరిగిపోయింది. ఇప్పటి నుంచి ఒక లెక్కా.. ఇక నుంచి ఒక లెక్కా అన్నట్లు ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రచారాన్ని, పర్యటనలను పెంచబోతున్నట్లు పార్టీ కేడర్‌కు ఇండికేషన్స్ ఇచ్చేస్తున్నాడట.
మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు స్థానంపై కోటి ఆశలు పెట్టుకున్న సీడబ్ల్యూసీ ప్రత్యేక అహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డికి ఎట్టకేలకు తీపి కబురు అందింది. టికెట్ ఆయనకే అంటూ సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష ప్రకటనతో యువనేత జోరు పెంచేందుకు సిద్దమయ్యారు. మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్న వంశీ చంద్ రెడ్డి ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.
పాలమూరు ఎంపీ టికెట్ కోసమే వంశీచంద్ రెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ త్యాగం చేశారన్న టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడంతో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజవర్గ పరిధిలో పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. పాలమూరు న్యాయ యాత్ర పేరుతో నియోజకవర్గం మొత్తం చుట్టెలా ప్రణాళిక కొనసాగిస్తున్నారు. టికెట్ రేసులోకి సీనియర్ నేతల ఎంట్రీతో కొంత నెమ్మదించినా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో తిరిగి ప్రచారాన్ని, పర్యటనలను మరింత పెంచాలని భావిస్తున్నాడట.
పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో యాత్రకు సిద్ధమవుతున్నాడట. అలాగే యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిస్తోంది. దీనికి జాతీయ నేతలు, సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక, పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి అని ధృవీకరణ కావడంతో ప్రతి కార్యక్రమంలో ఆయనను ఇన్వాల్వ్ చేసే ప్రణాళికలు అమలు చేయబోతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో నియోజకవర్గంలో ప్రచారాన్ని జోరు పెంచనున్నాడు వంశీచంద్ రెడ్డి. గతంలో కంటే పార్టీలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తల నుంచి వంశీచంద్ రెడ్డికి సహకారం అందనుంది. దీన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…