కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ఈ పేరు గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ విమెన్ లీడర్ సుపరిచితురాలే. కాగా సీతక్క మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆదివాసీల సమస్యలు తీర్చడానికి.. వారి బాగోగుల కోసం ఎప్పుడూ తపిస్తూ ఉంటారు. తాజాగా ఆమె ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం అడవి రంగాపూర్(నారాయణపూర్) గ్రామంలోని బండ్లపహాడ్ గొత్తికోయగూడెం వాసులకు ఆపన్నహస్తం అందించారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్న గొత్తికోయలు కోవిడ్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.దీంతో ఆమె శనివారం గుత్తికోయల వద్దకు వెళ్లి సరుకులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ ప్రాంతానికి సరైన మార్గం లేదు. నడుస్తూ అంతదూరం సరుకులు తీసుకెళ్లడం కష్టం. ఈ క్రమంలో ఎడ్లబండిపైనే ఆమె ప్రయాణించారు. ఆ బండిపైనే సరుకులు వేసుకుని అదే బండిపై తానూ అక్కడికి చేరుకున్నారు. ఆమె వెంట అనుచరులు, గన్‌మ్యాన్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. ఈ సందర్భంగా బియ్యం, కూరగాయలు, ఇతరత్రా సరుకులు గొత్తికోయలకు అందజేసి సీతక్క వారికి అండగా నిలిచారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో సీతక్క చేసిన సహాయ కార్యక్రమాలను ప్రజలు అభినందించారు.
Also Read: ఒకే వ్యక్తిలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్… రక్తం విషపూరితం.. మృతి