Telangana: వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో పోటీచేసేది వారే.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే అరెడ్ల జగదీశ్వర్ రెడ్డి( జగ్గారెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఓ కాంగ్రెస్ కార్యకర్త..

Telangana: వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో పోటీచేసేది వారే.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
MLA Jaggareddy

Updated on: Sep 07, 2022 | 3:36 PM

Telangana: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే అరెడ్ల జగదీశ్వర్ రెడ్డి( జగ్గారెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఓ కాంగ్రెస్ కార్యకర్త పోటీచేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఒక వేళ పార్టీ శ్రేణులు కార్యకర్తను వద్దంటే తన భార్య నిర్మల ఎమ్మెల్యే ఎన్నికల బరిలో దిగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోనని.. అయితే 2028 ఎన్నికల్లో మాత్రం పోటీచేస్తానంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ సంచలనం నిర్ణయం తీసుకోవడానికి కారణాలపై మాత్రం ఆయన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. హైదరాబాద్ (HYDERABAD)లో మీడియాతో చిట్ చాట్ లో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంమీద తాను పోటీచేయకపోయినా.. తాను చెప్పిన వ్యక్తే సంగారెడ్డిలో కాంగ్రెస్ (CONGRESS) అభ్యర్థిగా ఉండాల్సిందేనన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్లు అయింది. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. గతకొంతకాలంగా టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యవహారశైలిపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. సీనియర్లకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి సైతం జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. ఆ తర్వాత బహిరంగ విమర్శలు చేయబోనని చెప్పినా.. మళ్లీ రేవంత్‌ రెడ్డిపై జగ్గారెడ్డి పలు ఆరోపణలు చేశారు. మరోవైపు గత కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు జగ్గారెడ్డి. ఆకస్మాత్తుగా ఎన్నికల్లో పోటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో పార్టీ తరపున ఎవరూ పోటీచేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. అయితే జగ్గారెడ్డి మాత్రం సంగారెడ్డిలో ఎవరు పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపై టిపిసిసి ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..