Telangana: కాంగ్రెస్‌లో కొత్త కమిటీల కల్లోలం.. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా..

|

Dec 11, 2022 | 9:38 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీలు కల్లోలం రేపుతున్నాయి. కమిటీల్లో స్థానం లేకపోవడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లైట్‌ తీసుకుంటే.. కొండా సురేఖ మాత్రం ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రిజైన్ చేశారు. టీపీసీసీ చీఫ్‌ సీన్‌లొకొచ్చినా.. అరచేతిలో అలకలు ఆగుతాయా అన్నది పార్టీ వర్గాలను ఉక్కిబిక్కిరి చేస్తోంది.

Telangana: కాంగ్రెస్‌లో కొత్త కమిటీల కల్లోలం.. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా..
Konda Surekha
Follow us on

తెలంగాణ పీసీసీకి సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం కమిటీలు ప్రకటించింది. అందులో మాజీ మంత్రి కొండా సురేఖకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఏకంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన కంటే జూనియర్లకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారన్నది సురేఖ ఆవేదన. ఎమ్మెల్యేలుగా కూడా గెలవని వాళ్లు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారని.. తనను కూడా వారితో పాటే పరిగణించడం అసంతృప్తి కలిగించిందని టీపీసీసీ చీఫ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన సీనియారిటీని తగ్గించి ఆ కమిటీలో వేశారని.. అందుకే పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు. అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు సురేఖ. పదవుల కంటే ఆత్మాభిమానం ముఖ్యమని.. ఇకపై కాంగ్రెస్‌ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు.

రాజీనామా లేఖతో సురేఖను బుజ్జగించే ప్రయత్నం చేశారు రేవంత్‌ రెడ్డి. మ్యాటర్‌ను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో పేరు వచ్చేలా చేస్తానని అన్నారు. మరో వైపు కొత్త కమిటీల్లో స్థానం కల్పించకపోవడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. మంత్రి పదవే త్యాగం చేశా.. పదవులు తనకు ముఖ్యం కాదన్నారు.

మొత్తానికి కొండా సురేఖ రాసిన లేఖ టీపీసీసీలో హాట్‌ టాపిక్‌గా మారింది. అలకలు సురేఖతో ఆగుతాయా? ఒకరి తర్వాత మరొకరు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారా? కమిటీల కల్లోలానికి హైకమాండ్‌ ఎలా ఫుల్‌స్టాప్‌ పెట్టబోతుందన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..