AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ .. ఆ విషయాలపైనే చర్చ

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సాక్షిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను విచారించింది సీబీఐ. 160 సీఆర్పీసీ కింద వివరణ తీసుకున్నామని.. అవసరమైతే కవితకు మళ్లీ నోటీసులిచ్చి విచారిస్తామని సీబీఐ ప్రకటించింది.

MLC Kavitha: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ .. ఆ విషయాలపైనే చర్చ
Mlc Kavitha, Cm Kcr
Basha Shek
|

Updated on: Dec 11, 2022 | 9:44 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో భాగంగా సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విచారణ ముగిసిన అనంతరం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె విచారణ జరిగిన తీరును కేసీఆర్‌కు వివరించారు. అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే సీబీఐ విచారణ కానీ, కేసీఆర్‌తో సమావేశానికి సంబంధించి కానీ ఆమె మీడియాతో ఏం మాట్లాడలేదు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సాక్షిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను విచారించింది సీబీఐ. 160 సీఆర్పీసీ కింద వివరణ తీసుకున్నామని.. అవసరమైతే కవితకు మళ్లీ నోటీసులిచ్చి విచారిస్తామని సీబీఐ ప్రకటించింది. ఏడున్నర గంటలకు పైగా కవిత న్యాయవాది సమక్షంలో కొనసాగిన విచారణ మొత్తాన్ని రికార్డ్‌ చేశారు అధికారులు. ఈరోజు ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్నారు సీబీఐ అధికారులు. వారిలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. ఈ క్రమంలో కవిత నివాసం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో అధికారులు.. ప్రిపేర్ చేసుకున్న ప్రశ్నావళిని కవిత ముందుంచి ప్రశ్నించారు. ప్రధానంగా అమిత్ అరోరా రిమాండ్‌ రిపోర్ట్‌.. సౌత్ గ్రూప్‌ ముడుపుల వ్యవహారం.. ఢిల్లీ మంత్రి సిసోడియా, శరత్ చంద్రారెడ్డిలతో పరిచయాలు.. సెల్‌ఫోన్ల ధ్వంసంపై ఆరాతీసినట్టు సమాచారం. అలాగే కాల్‌ లిస్ట్‌, పలు కీలక డాక్యుమెంట్లపైన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సాక్షిగా మాత్రమే కవితను విచారించారు.

మళ్లీ పిలుస్తారా?

కాగా సీబీఐ సుదీర్ఘ విచారణ అనంతరం కవిత నివాసంలో భేటీ అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన కవిత కార్యకర్తలకు నవ్వుతూ అభివాదం చేశారు. మంత్రి తలసానితో కలిసి ప్రగతి భవన్ వెళ్లారు. ఉదయం నుంచి సీబీఐ విచారణకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు కవిత వివరించారు. లిక్కర్ స్కామ్‌లో సాక్షిగా కవిత వాంగ్మూలం తీసుకున్న సీబీఐ అధికారులు.. నెక్స్ట్‌ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందుతారా? లేదంటే మళ్లీ నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.